Sumalatha: ఎన్నికల వేళ.. భాజపా గూటికి సుమలత

సీనియర్‌ నటి, మాండ్య నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ సుమలత శుక్రవారం భాజపాలో చేరారు. 

Published : 05 Apr 2024 18:55 IST

బెంగళూరు: సీనియర్‌ నటి, మాండ్య నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ సుమలత(Sumalatha) శుక్రవారం భాజపాలో చేరారు. భాజపా సీనియర్ నేత యడియూరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఆర్.అశోక, జాతీయ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్, మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ తదితరులు ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు.

 ప్రముఖ సినీనటుడు ఎం.హెచ్. అంబరీష్ భార్య సుమలత తన భర్త ప్రాతినిధ్యం వహించిన మాండ్య స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్‌ కోసం భాజపాను సంప్రదించారు. కాని భాజపా-జేడీఎస్ పొత్తులో భాగంగా ఆ సీటు జేడీఎస్‌కు దక్కింది. ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రస్తుతం మాండ్య నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఆదివారం సుమలతను కలిసి ఎన్నికల్లో పోటీని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ విషయంపై సుమలత నియోజకవర్గంలోని తన మద్దతుదారులు, శ్రేయోభిలాషులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల బరి నుంచి వైదొలిగి భాజపాలో చేరుతున్నట్లు బుధవారం ప్రకటించారు.

అంబరీష్ కర్ణాటకలోనూ, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా విధులు నిర్వహించారు. భర్త మరణం తరువాత 2019లో సుమలత రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ ఆమెకు టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. భాజపా మద్దతుతో ఆమె అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిపై 1,25,876 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని