Arvind Kejriwal: బాబోయ్‌ మీకో నమస్కారం.. అంతా మీ దయ వల్లే జరిగింది: భాజపాకు కేజ్రీవాల్‌ కౌంటర్‌

దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి భాజపాపై విమర్శలు చేశారు. దిల్లీ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్య సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Published : 28 Mar 2023 01:35 IST

దిల్లీ:  దేశ రాజధాని దిల్లీ(Delhi)లో 65 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఆప్‌ (AAP) ప్రభుత్వం 8 ఏళ్లలో చేసి చూపిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. దిల్లీ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ప్రపంచంలోని పెద్ద నగరాల్లోని  రవాణ వ్యవస్థ తరహాలో దిల్లీ రవాణ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా దిల్లీ మెట్రో ఏర్పాటులో కేంద్రం సహకారం గురించి భాజపా (BJP) ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. వారి వ్యాఖ్యలపై అరవింద్‌ కేజ్రీవాల్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘ బాబోయ్‌..మీకో నమస్కారం.. అంతా మీ దయ వల్లే జరిగింది. 2014 తర్వాతే ఆకాశం, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రపంచం ఏర్పడ్డాయి. అంతా మీదే’’ అంటూ భాజపా సభ్యులను, ప్రధాని మోదీ (PM Modi)ని ఉద్దేశించి విమర్శించారు.  

దిల్లీలో 8 ఏళ్లలో కొత్తగా 28 ఫ్లైఓవర్లు నిర్మించడంతో పాటు, మెట్రోను 390 కిలోమీటర్లు విస్తరించామని తెలిపారు. 1998 నుంచి 2015 వరకు 143 స్టేషన్లతో 198 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం జరిగితే.. 2015 నుంచి 2023 వరకు 286 స్టేషన్లతో 390 కిలోమీటర్ల మెట్రో విస్తరణ జరిగిందని చెప్పారు. అంతకుముందు దిల్లీ బడ్జెట్‌ను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆమోదించకపోవడంతో కేజ్రీవాల్‌ ప్రధాని మోదీకి బడ్జెట్‌ను ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలతో దేశం నాశనం అవుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. బ్రిటిష్‌ పాలకుల కంటే భాజపా ప్రభుత్వం ఎంతో ప్రమాదకరమని.. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు సందర్భంగా కేజ్రీవాల్‌ భాజపాను ఉద్దేశించి విమర్శలు చేశారు. 

కొద్ది రోజుల క్రితం అరవింద్ కేజ్రీవాల్  2024 లోక్‌సభ ఎన్నికల కూటమిపై చర్చించేందుకు రావాలని భాజపాయేతర, కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏడుగురికి లేఖలు రాశారు.  ‘ప్రొగ్రెసివ్‌ చీఫ్‌ మినిస్టర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండియా (జీ8) పేరుతో ఆయన ఈ విందు భేటీ నిర్వహించాలనుకున్నారు. తనతోపాటు మొత్తం 8 మంది భేటీ అవ్వాలనేది కేజ్రీవాల్‌ ఆలోచనగా రాజకీయవర్గాలు తెలిపాయి. కానీ, ఆయన ఏర్పాటుచేసిన విందు సమావేశానికీ ఆహ్వానించి వారిలో ఒక్క సీఎం కూడా హాజరు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని