Kejriwal: కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి

దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్‌కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్ పూరి వ్యాఖ్యానించారు.

Updated : 29 Mar 2024 16:09 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను (Kejriwal) ఉద్దేశించి కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి (Hardeep Singh Puri) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఆయనకు చాలా తక్కువ సమయమే ఉందని, అందుకే ఆ స్థానంలో భార్య సునీతను కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలోని ముఖ్య నేతలందర్నీ పక్కకు నెట్టి త్వరలోనే ఆమె సీఎం కుర్చీని అధిరోహిస్తారన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సునీత, కేజ్రీవాల్‌ గతంలో రెవెన్యూ సర్వీసులో చేసినప్పుడు సహోద్యోగులు మాత్రమే కాదు. ప్రతీ ఒక్కర్నీ వారు తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు ‘మేడం’ కీలక పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 9సార్లు సమన్లు జారీ చేస్తే.. కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాలేదని హర్‌దీప్‌ అన్నారు. అందుకే ఈడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. సమయం చాలా తక్కువగా ఉందన్న సంగతి కేజ్రీవాల్‌కు కూడా అర్థమైందని వ్యాఖ్యానించారు. మద్యం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ కస్టడీని గురువారం దిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుపరచాలని ఈడీ అధికారులను ఆదేశించింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌) మాజీ అధికారి. 22 ఏళ్లపాటు ఆదాయపు పన్ను శాఖలో సేవలందించారు. భోపాల్‌లో శిక్షణ సమయంలో కేజ్రీవాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆమె 1994 బ్యాచ్‌కు చెందినవారు కాగా.. కేజ్రీవాల్ 1995 బ్యాచ్‌కు చెందినవారు.

‘కూటమి’ కథ ముగిసింది..

మరోవైపు చట్టబద్ధమైన పన్నుల చెల్లింపులను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని పూరి విమర్శించారు. ప్రతిఒక్కరూ రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని చెప్పారు. రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయ పన్ను విభాగం ఇవాళ కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఆ మరుసటి రోజే 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1800 కోట్లకుపైగా డిమాండ్‌ నోటీసులను ఐటీ పంపించింది. మరోవైపు అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా, దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 31న ఇండియా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై హర్‌దీప్ స్పందిస్తూ వాళ్ల సమయం ముగిసిందని, ఇక వారి గురించి మాట్లాడుకోవడం అనవసరమని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని