MLC Election: పట్టభద్రుల స్థానం.. పార్టీలకు ప్రతిష్ఠాత్మకం

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే మరో ఆసక్తికర ఎన్నికల పోరు సాగుతోంది.

Updated : 25 May 2024 05:46 IST

గెలుపే లక్ష్యంగా ముఖ్యనేతలంతా కార్యక్షేత్రంలో.. 
సాధారణ ఎన్నికల తరహాలో ‘ఖమ్మం-వరంగల్‌-నల్గొండ’ ఎమ్మెల్సీ పోరు
నేటితో ముగియనున్న ప్రచారం.. 27న పోలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే మరో ఆసక్తికర ఎన్నికల పోరు సాగుతోంది. ఖమ్మం - వరంగల్‌ - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానంలో గెలిచి.. సత్తాచాటాలని కాంగ్రెస్‌తో పాటు భారాస, భాజపా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 27న జరిగే ఎన్నిక కోసం తారస్థాయికి చేరిన ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనుంది. భారాస ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, భారాస తరఫున ఏనుగుల రాకేశ్‌రెడ్డి, భాజపా నుంచి జి.ప్రేమేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌రెడ్డి గతంలో ఈ స్థానానికి పోటీపడినవారే కాగా రాకేశ్‌రెడ్డి తొలిసారిగా బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల జోరు కొనసాగించాలని కాంగ్రెస్‌.. తమ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని భారాస, తొలిసారి పాగా వేయాలని భాజపా గట్టి పట్టుదలతో ఉన్నాయి.  

పోటాపోటీగా ప్రచారం..

మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నిక పార్టీలకు సవాల్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, భారాస అధినేత కేసీఆర్‌ మినహా ప్రధాన పార్టీల ముఖ్యనేతలందరూ పట్టభద్రుల స్థానంలో తమ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ తదితరులు కాంగ్రెస్‌ తరఫున ప్రచారంలో పాల్గొనగా.. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ముఖ్యనేత టి.హరీశ్‌రావు ఆ పార్టీ నుంచి పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, లక్ష్మణ్‌ తదితరులు కాషాయ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. సాధారణ ఎన్నికల తరహాలో సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగ ఓటర్ల మద్దతు కోసం సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తూ కాంగ్రెస్‌ ముందుకుసాగింది. భారాస గతంలో ఉద్యోగుల కోసం అమలు చేసిన కార్యక్రమాల గురించి ప్రచారంలో పేర్కొనగా.. మార్పు కోసం తమకు మద్దతు తెలపాలని భాజపా ప్రచారం చేస్తోంది. జూన్‌ 5న ఈ ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.


మొత్తం ఓటర్లు: 4,61,806 మంది
పురుషులు: 2,87,007 మంది
మహిళలు: 1,74,794 మంది 
ఇతరులు : ఐదుగురు 
పోలింగ్‌ కేంద్రాలు: 600
మొత్తం అభ్యర్థులు: 52 మంది


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని