ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

Published : 19 May 2024 06:03 IST

మేం మతస్వేచ్ఛను పరిరక్షిస్తాం
అయోధ్య ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం
ఖర్గే సహా విపక్ష నేతల ఉద్ఘాటన 

ముంబయి: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడం, ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య ఆలయ నిర్మాణాన్ని తాము పూర్తిచేస్తామన్నారు. పౌరులందరి మతస్వేచ్ఛను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. రాజ్యాంగ మూలసూత్రాలకు అనుగుణంగా దేశం నడుచుకునేలా చేస్తామని ప్రకటించారు. ఖర్గే, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ముంబయిలో శనివారం సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. విపక్ష కూటమి అధికార పగ్గాలు దక్కించుకుంటే రామమందిరాన్ని కూల్చివేస్తుందని, ఎస్సీ-ఎస్టీ-ఓబీసీల రిజర్వేషన్లను నిర్వీర్యం చేస్తుందని, ఆర్టికల్‌-370ని పునరుద్ధరిస్తుందని మోదీ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. రామాలయాన్ని కూల్చేస్తారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు మోదీపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవాలని ఖర్గే అన్నారు. 

రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కొనసాగుతాయ్‌ 

కాంగ్రెస్‌ ఆలోచనల్లో అసలెప్పుడూ లేని కొన్ని అంశాలను ఆపాదిస్తూ ప్రజలను ప్రధాని మోదీ రెచ్చగొడుతున్నారంటూ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేమెప్పుడూ ఎవరిపైనా బుల్డోజర్‌ ప్రయోగించలేదు. అబద్ధాలు చెప్తూ ప్రజలను రెచ్చగొట్టే అలవాటు మోదీకి ఉంది’’ అని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే- రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆర్టికల్‌-370 విషయంలో పార్టీ వైఖరి గురించి స్పందిస్తూ.. ‘‘నేను మోదీకి జవాబుదారుడిని కాదు. మా మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన దాన్ని మేం అమలు చేస్తాం. మోదీ ఎక్కడికెళ్లినా, సమాజంలో చీలికలు తెచ్చేలా మాట్లాడుతుంటారు. ఇలాంటి ప్రధానిని నా 53 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు’’ అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక జీఎస్టీని సరళీకరిస్తామని చెప్పారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమితోనే ఉన్నారని స్పష్టం చేశారు. తృణమూల్‌తో పొత్తు విషయంలో తమ పార్టీ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పొత్తు గురించి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది తప్ప, అధీర్‌ కాదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని