INDIA Bloc: మోదీ పాలనపై పోరాడతాం.. సరైన సమయంలో తగిన నిర్ణయం: ఖర్గే కీలక వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేలడంతో దిల్లీలో అటు ఎన్డీయే.. ఇటు ‘ఇండియా’ కూటమి నేతల భేటీలతో దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Updated : 05 Jun 2024 23:39 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేలడంతో దిల్లీలో అటు ఎన్డీయే.. ఇటు ‘ఇండియా’ కూటమి నేతల భేటీలతో దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఇండియా’ కూటమి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వచ్చిందన్న ఖర్గే.. ఆయన నైతికంగా ఓడిపోయారన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగానూ నష్టపోయారని విమర్శించారు. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలు వస్తే ఆహ్వానిస్తామని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా సమన్వయంతో బాగా పోరాడాయని ప్రశంసించారు. 

సరైన సమయంలో తగిన చర్యలు..

‘ఇండియా’ కూటమి భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. భాజపా విద్వేష రాజకీయాలు, అవినీతికి ప్రజలు సరైన రీతిలో సమాధానం చెప్పారన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేలా తీర్పు ఇచ్చారంటూ ప్రశంసించారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా తమ కూటమి పోరాటం కొనసాగుతుందన్నారు. భాజపా అధికారంలో ఉండకూడదన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. తమ కూటమి పక్షాలన్నీ ఐక్యంగా పనిచేస్తాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నిలబెట్టుకుంటాయని చెప్పారు.

ఎన్డీయే పక్షనేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్‌

బుధవారం సాయంత్రం ఖర్గే నివాసంలో జరిగిన ‘ఇండియా’ కూటమి భేటీలో కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలతోపాటు.. శరద్‌ పవార్‌ (ఎన్సీపీ-ఎస్‌పీ), ఎంకే స్టాలిన్‌ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ), కేసీ వేణుగోపాల్‌ (కాంగ్రెస్‌), సంజయ్‌ రౌట్‌ (శివసేన-ఉద్ధవ్‌ఠాక్రేవర్గం), సంజయ్‌ సింగ్‌ (ఆప్‌), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), అభిషేక్‌ బెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌), చెంపయీ సోరెన్‌ (జేఎంఎం), రాఘవ్‌ చద్దా (ఆప్‌), డి.రాజా (సీపీఐ), సుప్రియా సూలే, కల్పనా సోరెన్‌ సహా పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

మరోవైపు, ఎన్డీయే నేతలు ప్రధాని మోదీ నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నరేంద్ర మోదీని తమ కూటమిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. నరేంద్ర మోదీ ఈనెల 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు