Killi Kruparani: వైకాపాకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి (Killi Kruparani) వైకాపా (YSRCP)కు రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 03 Apr 2024 17:10 IST

శ్రీకాకుళం: కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి (Killi Kruparani) వైకాపా (YSRCP)కు రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌కు పంపారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. ఆమె కుమారుడు విక్రాంత్‌కు టెక్కలి అసెంబ్లీ టికెట్‌ ఇస్తారని సమాచారం. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కృపారాణి పోటీ చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

2009 ఎన్నికల్లో కృపారాణి శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తెదేపాకు చెందిన దివంగత నేత, రాజకీయ ఉద్దండుడు కింజరాపు ఎర్రన్నాయుడిని ఓడించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. తొలి అవకాశంలోనే కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించిన ఆమె.. 2019 ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. చేరిన తర్వాత రోజే పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. 

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఆమెకు రాజకీయ పరంగా తగిన ప్రాధాన్యం దక్కలేదు. రాజ్యసభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఆమెకే అవకాశం వస్తుందని భావించినా పలుమార్లు నిరాశే ఎదురైంది. ఉత్తరాంధ్రలో పదవులు కట్టబెట్టినవారితో పోల్చుకుంటే తనకు సరైన గుర్తింపు దక్కలేదని కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ సైతం ఎక్కడా పోటీ చేసే అవకాశం సైతం కల్పించకుండా ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని ఆమె అనుచరవర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం కృపారాణి వైకాపాకు రాజీనామా చేశారు. 

కృపారాణి బలమేంటో చూపిస్తా..

వైకాపాలో తనకు అన్యాయం జరిగిందంటూ మీడియా సమావేశంలో కృపారాణి కన్నీరు పెట్టుకున్నారు. ‘‘ ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు. నా పుట్టినిల్లు.. మెట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా. కాంగ్రెస్‌ అంతా వైకాపాలో ఉంది.. నా కుటుంబం అని భావించి ఆ పార్టీలో చేరా. కేబినెట్‌ ర్యాంకు పదవి ఇస్తామని నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. 2019లో పార్లమెంట్‌కి పోటీ చేయమన్నారు. కార్యకర్తగా పనిచేయాలని జగన్‌ను కలిసినప్పుడు చెప్పారు. తగిన గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థిగా టికెట్‌ ఇస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. కానీ, అభ్యర్థుల జాబితాలో నా పేరు లేదు.

జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు.. ఎందుకు ఇచ్చారో, ఎందుకు తీసేశారో తెలియదు. ఆ పార్టీలో ఉండాలి ఉంటే తిట్లు వచ్చే వాళ్లే ఉండాలి. నాకు తిట్టడం రాదనే పక్కన పెట్టారు. నాకు ఇంత వంచన చేస్తారా? ఈ వంచనకు ఏమని పేరు పెట్టాలి? నాకు పదవి కాదు.. గౌరవం కోరుకుంటున్నా. సీఎం జిల్లాకు వస్తే.. హెలిప్యాడ్‌ దగ్గరకు రాకుండా చేశారు. కృపారాణిని పథకం ప్రకారం అణచి వేయాలని చూశారు. నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా. నన్ను గౌరవించే పార్టీలోకి వెళతా.. కృపారాణి బలమేంటో చూపిస్తా. ఊరుకోను కచ్చితంగా పోటీలో ఉంటా’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని