BJP: విధేయతకు ప్రాధాన్యం

తొలిసారిగా తెలంగాణ... కేంద్రంలో రెండు మంత్రి పదవులను సొంతం చేసుకుంది. పదేళ్ల భాజపా పాలనలో ఇప్పటివరకు ఒకరికే మంత్రి పదవి దక్కింది.

Updated : 10 Jun 2024 06:46 IST

 పార్టీకి చేసిన సేవల్నీ పరిగణనలోకి తీసుకొని కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు బాధ్యతలు
తొలిసారిగా తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు
త్వరలో రాష్ట్రానికి కొత్త భాజపా అధ్యక్షుడి నియామకం
ఈటల సహా మరికొందరి పేర్లు పరిశీలించే అవకాశం

కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ముర్ము

ఈనాడు, హైదరాబాద్‌: తొలిసారిగా తెలంగాణ... కేంద్రంలో రెండు మంత్రి పదవులను సొంతం చేసుకుంది. పదేళ్ల భాజపా పాలనలో ఇప్పటివరకు ఒకరికే మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో ఓట్లను, సీట్లను పెంచుకోవడంతో జాతీయ నాయకత్వం రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. సంస్థాగత అనుబంధానికి, విధేయతకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీకి చేసిన సేవల్నీ పరిగణనలోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. కిషన్‌రెడ్డి రెండో పర్యాయం సికింద్రాబాద్‌ నుంచి గెలవగా... సంజయ్‌ కూడా కరీంనగర్‌ నుంచి రెండోసారి విజయం సాధించారు. పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఈ ఇద్దరు నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది.

రెండేసి సార్లు ఎన్నికైన ముగ్గురు ఎంపీలు ఉండగా..

గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రివర్గంలోకి రాష్ట్రం నుంచి తీసుకునే వారికి సంబంధించి పలువురి పేర్లు చర్చకు వచ్చాయి. పార్టీ నుంచి ఎన్నికైన ఎనిమిది మందిలో కిషన్‌రెడ్డి, సంజయ్, అర్వింద్‌ రెండేసి సార్లు గెలుపొందారు. జాతీయ నాయకత్వం కిషన్‌రెడ్డి, సంజయ్‌ల వైపే మొగ్గు చూపింది. అర్వింద్‌... సంజయ్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో మంత్రి పదవి దక్కలేదని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మిగిలిన ఎంపీలలో ఈటల రాజేందర్‌ మొదటిసారి మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మంత్రి పదవికి ఈటల పేరు చర్చకొచ్చినా మొదటిసారి ఎన్నికవడంతో పాటు పార్టీ కీలక పదవులను దృష్టిలో ఉంచుకున్నట్లు నాయకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ గతంలో మహబూబ్‌నగర్‌లో పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయి తాజాగా గెలిచారు. ఆమె మొదటి సారి లోక్‌సభకు ఎన్నిక కావడంతో పాటు కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఇతర సభ్యులను పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. 

సంజయ్‌కు అప్పుడే ఇస్తారని చర్చ జరిగినా..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి చేసిన కృషిని పరిగణనలోకి తీసుకొని కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు మంత్రిపదవులు ఇచ్చినట్లు తెలుస్తోంది. భాజపా అనుబంధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించి పార్టీకోసం పనిచేయడం వంటి అంశాలకూ ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. గతంలో సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరిగినా పార్టీ ఆయన్ను జాతీయ ప్రధానకార్యదర్శిగా నియమించింది. తాజాగా కేంద్రమంత్రిగా అవకాశం కల్పించింది. కిషన్‌రెడ్డి ఐదేళ్లుగా కేంద్రమంత్రిగా విధులు నిర్వహించారు. మొదట హోంశాఖ సహాయమంత్రిగా వ్యవహరించిన ఆయనకు తర్వాత పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖలను అప్పగించింది. తాజాగా మరోసారి కేంద్రమంత్రిగా నియమించింది. రాష్ట్రంలో మిగిలిన భాజపా ఎంపీల్లో ఆదిలాబాద్‌ నుంచి ఎన్నికైన గోడం నగేష్‌ ఎన్నికలముందే భాజపాలో చేరారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల నుంచి ఎన్నిక కాగా 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆయన భాజపాలో చేరారు. మెదక్‌ నుంచి ఎన్నికైన రఘునందన్‌రావు కూడా లోక్‌సభకు తొలిసారి ఎన్నిక కావడంతోనే మంత్రి పదవి అంశంలో పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.

రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు

కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా కీలక మార్పులను జాతీయ నాయకత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భాజపాలో రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది. ఈటల రాజేందర్‌ను నియమించే అవకాశం ఉందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నా, కొత్త పేర్లు కూడా పరిశీలించేందుకు అవకాశం ఉన్నట్లు మరికొందరు పేర్కొంటున్నారు. సంజయ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటంతో మంత్రి పదవి నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారని చర్చ నడుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు