Telangana BJP: కమలం.. పదవుల బలం

భాజపా జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రిత్వశాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వడంపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు భాజపా కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతోపాటు ముఖ్యశాఖలు  కేటాయించడంతో కమలం వర్గాలు ఆనందంతో ఉన్నాయి.

Published : 11 Jun 2024 03:21 IST

కేంద్ర మంత్రిత్వ శాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం
ఓట్లు.. సీట్లు పెరిగిన నేపథ్యం
పార్టీ బలోపేతానికి దోహదపడుతుందంటున్న నేతలు 
ఈటల రాజేందర్‌కూ కీలక పదవి?

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రిత్వశాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వడంపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు భాజపా కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతోపాటు ముఖ్యశాఖలు  కేటాయించడంతో కమలం వర్గాలు ఆనందంతో ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీకి ఓట్లు, సీట్లు పెరిగిన నేపథ్యంలో ఇలా ప్రాధాన్యమివ్వడం పార్టీ సంస్థాగతంగా మరింత పటిష్ఠం కావడానికి దోహదపడుతుందని కాషాయ నేతలు పేర్కొంటున్నారు. గత ఐదేళ్లలో తొలుత హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిషన్‌రెడ్డికి తర్వాత ప్రాధాన్యం పెరిగి శాఖల మార్పుతోపాటు క్యాబినెట్‌ మంత్రిగా ప్రమోషన్‌ లభించింది. పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఆయన నిర్వహించారు. ఇప్పుడు కూడా క్యాబినెట్‌ హోదా ఇవ్వడంతోపాటు ప్రధానమైన బొగ్గు, గనుల మంత్రిత్వశాఖను కేటాయించడం విశేషం. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి. కీలకమైన హోంశాఖలో సంజయ్‌ని భాగస్వామిగా చేయడం రాష్ట్ర పార్టీకి ప్రధాని, అగ్రనేత అమిత్‌షా ఇస్తున్న ప్రత్యేక గుర్తింపుగా విశ్లేషిస్తున్నారు. నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 8 స్థానాలు, 13 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఐదు నెలల అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలవడంతోపాటు 35 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. తాజా ఫలితాలపై భాజపా జాతీయ నాయకత్వం సంతృప్తి చెందినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. 

మరికొందరు నేతలకు పార్టీ పదవులు

పార్టీ పదవుల్లో రాష్ట్ర నేతలకు ఇప్పటికే సముచిత ప్రాధాన్యం లభించింది. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా సీనియర్‌ నేత కె.లక్ష్మణ్‌ ఉన్నారు. ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి కీలకమైన పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా కూడా నియమించారు. బండి సంజయ్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యనేత డి.కె.అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో ముఖ్యనేతలు ఎంపీలుగా ఎన్నికవడంతో పార్టీ పదవుల్లో కీలక మార్పులకు జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టనుంది. కేంద్ర మంత్రి పదవులను ఆశించిన వారిలో మల్కాజిగిరి, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ ఎంపీలు ఈటల రాజేందర్, డి.అర్వింద్, డి.కె.అరుణ కూడా ఉన్నారు. కిషన్‌రెడ్డి మళ్లీ క్యాబినెట్‌ మంత్రిగా నియమితులైన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ సోమవారం భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలను విశ్లేషిస్తూ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఈటల ముందున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బండి సంజయ్‌ కేంద్రమంత్రి కావడంతో ఆయన నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని మరో నేతకు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కూడా పార్టీ పదవుల్లో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు