Kishan Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాహుల్ గాంధీ మరిచిపోయారా?: కిషన్‌రెడ్డి

భారాస హయాంలో రైతులకు అన్నివిధాలుగా అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 15 Apr 2024 14:21 IST

హైదరాబాద్: భారాస హయాంలో రైతులకు అన్నివిధాలుగా అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చినట్లు గుర్తు చేసిన ఆయన.. వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. 

‘‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి కార్యాచరణ చేస్తారో చెప్పాలి. దళిత బంధు, గిరిజన బంధు పేరుతో కేసీఆర్ వెన్నుపోటు పొడిచారు. గత భారాస సర్కారు అడుగు జాడల్లోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోంది. రూ.2 లక్షల రుణ మాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దగా చేసింది. బ్యాంకులు అన్నదాతలకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో దళారుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి దిల్లీకి వెళ్లడంలో ఉన్న శ్రద్ధ.. ధాన్యం కొనుగోలులో లేదు. ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? పాత గ్యారంటీలు పక్కన పెట్టి తుక్కుగూడలో కొత్త గ్యారంటీలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాహుల్ గాంధీ మరిచిపోయారా? వరికి రూ.500 బోనస్ ఒక్క రైతుకైనా ఇచ్చారా? కాంగ్రెస్ హయాంలో ఎరువులను బ్లాక్‌లో కొనేవారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం ప్రతి రైతుకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని