Kishan Reddy: రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి

రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నేతలు రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.

Published : 22 May 2024 14:36 IST

హైదరాబాద్‌: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నేతలు రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్‌ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఆగస్టు 15లోగా అమలు చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. సన్న వడ్లకే బోనస్‌ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని చెప్పారు. చాలా తక్కువ మంది రైతులే సన్న రకం పండిస్తారని తెలిపారు. 

‘‘దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. వాటిని కొనేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఈ ప్రభుత్వం బోనస్‌ పేరుతో అన్నదాతలను మోసం చేసింది. కేంద్రం అన్ని రకాలుగా వారికి అండగా ఉంది. రబీ సీజన్‌లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించాలని కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో భారాస, ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా, కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. మార్కెట్‌యార్డుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొనేందుకు మరో 2 నెలలు పడుతుంది. వర్షాలు పడి ధాన్యం మొలకలు వస్తుంటే బాధ్యులు ఎవరు?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని