Kishan Reddy: 6 నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత: కిషన్‌రెడ్డి

భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated : 06 Jun 2024 15:33 IST

దిల్లీ: భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 47 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అత్యధిక ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ చేయలేదు.. ఎంఐఎం పోటీ చేసింది. లోపాలు సరిదిద్దుకుని భవిష్యత్తులో రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. 6 నెలల్లోనే కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత మొదలైంది.

భాజపాకు తెలంగాణ ప్రజలు 35 శాతానికిపైగా ఓట్లు వేశారు. మాపై విశ్వాసం ఉంచి.. అధిక స్థానాల్లో గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క శాతం ఓటింగ్‌ మాత్రమే పెరిగింది. తెలంగాణలో చాలా చోట్ల భారాసకు డిపాజిట్లు రాలేదు. రాష్ట్ర ప్రజలు కాషాయ పార్టీకి అండగా నిలబడ్డారు. గతంలో రేవంత్‌రెడ్డి గెలిచిన మల్కాజిగిరిలో కూడా మేం గెలిచాం. కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, సిద్దిపేట ఉన్న మెదక్‌లో విజయం సాధించాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో భాజపా ప్రశ్నిస్తుంది. అమిత్‌షాపై తప్పుడు కేసు పెట్టారు. హస్తం పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తాం. ఏపీలో అద్భుతమైన మెజార్టీతో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని