Kishanreddy: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. కేసీఆర్‌తో చర్చకు సిద్ధం: కిషన్‌రెడ్డి

తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated : 23 Mar 2024 17:01 IST

హైదరాబాద్‌: తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం నాంపల్లిలోని  పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారన్నారు. 

‘‘దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కేసులో తమ కుటుంబానికి, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సంబంధం లేదని కేసీఆర్‌ చెప్పగలరా? మద్యం పాలసీలో దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం అవకతవకలు చేసింది. దిల్లీలో తీగ లాగితే తెలంగాణలో దొరికింది. కేజ్రీవాల్‌, కవిత అరెస్టును దేశమంతా సమర్థిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్‌తో చర్చకు మేం సిద్ధం. అక్రమాలను ఆధారాలతో  సహా నిరూపిస్తా. కేజ్రీవాల్‌ తప్పు లేదని కేసీఆర్‌ నిరూపించగలరా? కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించిన కేసీఆర్‌.. కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదు. కవిత అరెస్టు విషయంలో కేసీఆర్‌ మౌనానికి కారణమేంటో ప్రజలకు చెప్పాలి. కాళేశ్వరం అవినీతిపై దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలి. తెలంగాణలోని 17పార్లమెంట్‌ స్థానాల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుంది’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని