KTR: తెలంగాణలో ప్రభుత్వం ఉన్నటా? లేనట్టా?: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు.

Updated : 29 May 2024 11:09 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అని నిలదీశారు. ‘నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేవాళ్లు లేరు.. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేవాళ్లు లేరు’ అని ఎద్దేవా చేశారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. సాగునీరు ఇవ్వడం చేతకాక పంటలు ఎండబెట్టారు.. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు.

‘‘తెల్లవారుజామున 4 గంటలకు లైన్‌లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా? దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణలో అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా? భారాస పాలనలో వ్యవసాయం పండగలా సాగింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేశారు. ఇప్పటికైనా సరిపడా విత్తనాలు తెప్పించాలి. బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా కళ్లెం వేయాలి. లేదంటే రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు’’ అని కేటీఆర్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు