Kunamneni: భాజపా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తోంది: కూనంనేని సాంబశివరావు

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Updated : 22 Mar 2024 15:49 IST

హైదరాబాద్‌: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల బాండ్లతో భాజపాకు రూ.వేల కోట్లు వచ్చాయని.. ఇదంతా అక్రమ సంపాదనే అని ధ్వజమెత్తారు. ఎన్నికల బాండ్లు ఇచ్చిన, తీసుకున్న వారిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ను భాజపా ప్రభుత్వం ఎన్నో బెదిరింపులు, వేధింపులకు గురి చేసినా లొంగకపోవడంతో అరెస్టు చేశారని చెప్పారు. 

‘‘ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని భాజపా చూస్తోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే కుట్రతో సీఏఏను తీసుకొచ్చింది. భాజపాను ఎదుర్కోవడంలో, సమర్థంగా నిలబడటంలో కాంగ్రెస్ విఫలమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాలను కలుపుకొనిపోవాలి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాంగ్రెస్‌తో మేం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక్క ఎంపీ సీటు ఇచ్చే అంశాన్ని ఆ పార్టీ పరిగణనలోకి తీసుకోవాలి. వామపక్షాలతో కలిసి వెళ్లడంతోనే రాష్ట్రంలో భారాసను ఓడించాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి.’’ అని కూనంనేని సాంబశివరావు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని