Kunamneni: కుమిలిపోం.. మా సత్తా ఏంటో చూపిస్తాం: కూనంనేని సాంబశివరావు

భారాస చేసిన తప్పుతో కుమిలిపోమని, తమ సత్తా ఏంటో చూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) వెల్లడించారు.

Updated : 24 Aug 2023 15:46 IST

హైదరాబాద్‌: భారాస చేసిన తప్పుతో కుమిలిపోకుండా తమ సత్తా ఏంటో చూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) వెల్లడించారు. సమరశీల పోరాటాలు చేసి గ్రామగ్రామానా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ఉమ్మడి 10 జిల్లాల్లోని 30 సీట్లలో సీపీఐకి 10 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. 

సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ

‘‘సెప్టెంబర్ 17ను బంగారు అక్షరాలతో చరిత్రలో లిఖించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. భారాస అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పారు. దీనిపై కేసీఆర్ తన విధానం స్పష్టం చేయాలి. చరిత్రను వక్రీకరించకుండా ఒక కమిటీ వేసి సమాజానికి అందించాలి. సెప్టెంబర్ 11 నుంచి మేం బస్సు యాత్ర చేస్తాం. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించి సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా ముఖ్య అతిథిగా హాజరవుతారు. 

కేసీఆర్ కనీసం రాజకీయ విలువలు పాటించలేదు

‘ఇండియా’ కూటమిలో చేరి మిత్ర ధర్మం పాటించలేదని ఒక పత్రికలో రాశారు. కేసీఆర్ మిత్ర ధర్మం పాటించారు కాబట్టే కంటి వెలుగు, భారాస, మునుగోడు సభకు తమను పిలిచామని చెబుతున్నారు. పొత్తు వద్దని ప్రకటించాలి తప్పితే ఒక్క సీటు ఇస్తానని ఎందుకు చెప్పాలి?‘ఇండియా’ కూటమిలో చేరి పొత్తు నుంచి వైదొలిగామని చెబుతున్న భారాస నాయకులు.. ఎందుకు ఒక్క సీటు ఇస్తామని సంప్రదింపులు జరిపారు. 2004లో కాంగ్రెస్, 2009లో తెదేపాతో కేసీఆర్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు. ఎవరూ బలంగా ఉంటే వాళ్లతో పొత్తు పెట్టుకుని, మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదం. వెన్నుపోటు ఎలా పొడవాలి.. అధికారంలోకి ఎలా రావాలన్నదే మీ పని. కేసీఆర్ కనీసం రాజకీయ విలువలు పాటించలేదు’’ అని కూనంనేని విమర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని