Lalu prasad Yadav: టికెట్ల అమ్మకంలో ‘లాలూ’ దిట్ట.. కిడ్నీ ఇచ్చినందుకు టికెట్‌!

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి  సామ్రాట్‌ చౌధరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Updated : 22 Mar 2024 19:35 IST

పట్నా: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ (Loksabha Elections) విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంటోంది. అధికార, విపక్ష నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ (Lalu prasad Yadav) యాదవ్‌పై బిహార్‌ డిప్యూటీ సీఎం, భాజపా నేత సామ్రాట్‌ చౌధరి (Samrat Choudhary) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టికెట్లు అమ్ముకోవడంలో లాలూ దిట్ట అని, చివరికి కూతుర్ని కూడా ఆయన విడిచిపెట్టలేదని అన్నారు. కుమార్తె రోహిణి నుంచి తొలుత కిడ్నీ తీసుకొని, ప్రతిఫలంగా ఆమెకు టికెట్‌ కేటాయిస్తున్నారని ఆరోపించారు. లాలూ ఇద్దరు కుమార్తెలూ తాజా ఎన్నికల బరిలోకి దిగుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో లాలూప్రసాద్‌కు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయనకు కుమార్తె రోహిణి అర్చన కిడ్నీ దానం చేశారు.

సామ్రాట్‌ చౌధరి వ్యాఖ్యలపై ఆర్జేడీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆయన కుష్వాహా సామాజిక వర్గం పరువు తీస్తున్నారని విమర్శించింది. రానున్న ఎన్నికల్లో భాజపా అహంకారానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆర్జేడీ నేతలు ధ్వజమెత్తారు. మరోవైపు బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19  నుంచి జూన్‌ 1 వరకు ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా-జేడీయూ కూటమి 39 స్థానాల్లో విజయం సాధించి క్లీన్‌ స్వీప్‌ చేసింది. కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఆర్ఎస్‌ఎల్పీ పార్టీలు ఏర్పాటుచేసిన ‘మహాఘట్‌ బంధన్‌’ కేవలం కిషన్‌గంజ్‌ స్థానంలోనే గెలుపొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని