AP Election Results: పొత్తు సూపర్‌హిట్‌

వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే ఏకైక ఎజెండాగా పనిచేసిన తెదేపా, జనసేన, భాజపాల పొత్తు సూపర్‌హిట్‌ అయింది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల ధాటికి ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపా కకావికలమైంది.

Updated : 05 Jun 2024 09:31 IST

ఒకే మాట..ఒకే బాటగా కదిలిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ల ధాటికి వైకాపా విలవిల

ఈనాడు, అమరావతి: వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే ఏకైక ఎజెండాగా పనిచేసిన తెదేపా, జనసేన, భాజపాల పొత్తు సూపర్‌హిట్‌ అయింది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల ధాటికి ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపా కకావికలమైంది. ఇప్పటివరకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విజయాన్ని కూటమి సొంతం చేసుకుంది. 2014లో తెదేపా, జనసేన, భాజపా కలిసికట్టుగా సాధించిన దానికంటే ఈ సారి అఖండ విజయాన్ని అందిపుచ్చుకుంది. వైకాపాను కూకటివేళ్లతో పెకలించి వేసింది. సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలనే వైకాపా ఎత్తుగడను చిత్తు చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వైకాపాను దాదాపుగా ఊడ్చిపారేసింది. అగ్రనేతల మొదలు క్షేత్రస్థాయిలో కార్యకర్తల వరకు ఒకే మాట, ఒకే బాటగా సాగారు. ఇవన్నీ ఫలించి పొత్తు దిగ్విజయమైంది. 

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే పొత్తు పొడుపు....

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసకాండపై మొదట చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కృష్ణార్జునుల్లా సమరశంఖం పూరించారు. రెండు పార్టీల మధ్య పొత్తు రాత్రికి రాత్రే సాధ్యమవలేదు. అనేక విస్తృత సమావేశాల తర్వాత వారు ఒక నిర్ణయానికి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే రెండు పార్టీల మధ్య పొత్తుకు అంకురార్పణ జరిగింది. మండల, జిల్లాపరిషత్‌ ఎన్నికల్లో కొన్ని చోట్ల కింది స్థాయిలో కార్యకర్తలు అవగాహనతో కలిసి పనిచేశారు. వైకాపా నిర్బంధాలను ఎదిరించి చాలా చోట్ల గెలిచారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ‘వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌’ నినాదంలో భాగంగా ఓట్లు చీలకూడదనే సంకేతాలను క్యాడర్‌కు ఇస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం పొత్తులో కీలక మలుపు. ఆయన జైల్లో ఉండగా ములాఖత్‌లో భాగంగా కలిసేందుకు వెళ్లిన పవన్‌...బయటకు వచ్చి అనూహ్యంగా పొత్తును ప్రకటించారు. ఆ తర్వాత అది విస్తృతమైంది. వైకాపా ప్రభుత్వంపై ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పోరాటం చేశారు. కార్యకర్తల మధ్య ఎక్కడా ఇసుమంతైనా పొరపచ్చాలు రాకుండా అధినేతలు కీలకంగా వ్యవహరించారు. అయితే చివరి నిమిషం దాకా భాజపా పొత్తులోకి వస్తుందా? రాదా అనే సందిగ్ధత కొనసాగింది. షెడ్యూలు వెలువడటానికి కొన్ని రోజుల ముందు భాజపా కూడా కలిసొచ్చింది. భాజపా కూడా తమతో కలిసి వచ్చేలా పవన్‌ విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా భాజపా వారి బలానికి మించి ఎక్కువ సీట్లు అడిగినా...విస్తృత ప్రయోజనాల  దృష్ట్యా ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. 

విస్తృత చర్చలు... సంప్రదింపులు...

పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో విస్తృత చర్చలు, సంప్రదింపులు కొనసాగించారు. మొదట శ్రీకాకుళం నియోజకవర్గాన్ని భాజపాకు కేటాయించారు. ఆ తర్వాత అనేక సమీకరణాలను బేరీజు వేసుకుని విజయావకాశాలకు అనుగుణంగా శ్రీకాకుళంలో తెదేపా పోటీ చేసే ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని భాజపాకు ఇచ్చారు. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం విషయంలోనూ అంతే. మొదట దీన్ని భాజపాకు కేటాయించారు. ఆ తర్వాత చర్చలు, సంప్రదింపులూ జరిపి తెదేపా ఆ స్థానంలో పోటీ చేసింది. అనపర్తి శాసనసభ నియోజకవర్గం విషయంలోనూ తొలుత పీటముడి పడింది. చివరికి తెదేపాకు చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపాలో చేరి ఆ పార్టీ తరఫునే పోటీ చేశారు. ఇలా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అనేక మార్పులు జరిగాయి.

జగన్‌ అరాచకాలపై విరుచుకుపడుతూ...

ఏపీలో భాజపా 10 శాసనసభ, ఆరు లోక్‌సభ స్థానాల్లోనే పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాని మోదీ అసాధారణ రీతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్‌ షోలను నిర్వహించారు. తొలి సభలో ఆయన జగన్‌ను విమర్శించకపోవడంతో దాన్ని వైకాపా నేతలు ఎత్తిచూపారు. ఆ తర్వాత పాల్గొన్న సభల్లో మోదీ నేరుగా జగన్‌నే టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. జగన్‌ ప్రభుత్వ అవినీతి, ఇసుక, మద్యం దందాలు, భూముల దోపిడీ వంటి అంశాలపై ఘాటైన విమర్శలు చేశారు. దీంతో ఆ పార్టీ నేతలకు ఊపిరి ఆడని పరిస్థితి ఎదురైంది. నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలో భాజపా అభ్యర్థులెవరూ పోటీలో లేనప్పటికీ..చిలకలూరిపేటలో జరిగిన ఎన్డీయే సభకు ప్రధాని హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారంలో తొలి నుంచే జగన్‌ అవినీతిపై, వైకాపా విధ్వంస పాలనపై విరుచుకుపడ్డారు. వైకాపా నేతల గుండెల్లో వణుకు పుట్టించారు. అగ్రనేతలైన నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌లూ ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు సైతం పదునైన విమర్శలతో వైకాపాను గడగడలాడించారు. 

అద్భుతమైన సమన్వయం...

ఒకసారి పొత్తు కుదిరాక ఆ పార్టీ నేతలెవరూ వెనుదిరిగి చూడలేదు. సీట్ల సర్దుబాటు, మ్యానిఫెస్టో, ఉమ్మడి ఎన్నికల ప్రచారం మొదలు అన్ని అంశాల్లోనూ అద్భుతమైన సమన్వయంతో ముందుకు దూసుకెళ్లారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఉమ్మడిగా విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా జనసేన పోటీ చేసే తెనాలి వంటి ముఖ్య స్థానాల్లో పవన్‌కల్యాణ్‌తో కలిసి కాకుండా చంద్రబాబు ఒక్కరే ప్రచారం నిర్వహించారు. అదే విధంగా రేపల్లె, పొన్నూరు వంటి చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా..పవన్‌కల్యాణ్‌ అక్కడ ప్రచారం చేశారు. తిరుపతి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో తెదేపా బరిలో లేకున్నా....పవన్‌కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, రైల్వేకోడూరు ఎన్నికల ప్రచారానికి ఇద్దరూ కలిసి వెళ్లారు. ప్రధాని మోదీ నిర్వహించిన సభల్లోనూ వీరు పాల్గొన్నారు. ఇది మూడు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసేందుకు ఉపయోగపడింది. మ్యానిఫెస్టో తయారీలోనూ జనసేన ప్రతిపాదించిన అంశాలను తెదేపా చేర్చింది. ఉమ్మడిగా ఇరు పార్టీల నేతలు దానిని విడుదల చేశారు. ఇందులో భాజపా భాగస్వామి కాకపోవడంపై అపోహలు సృష్టించేందుకు వైకాపా నేతలు ప్రయత్నించినా...భాజపా సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్‌ తిప్పికొట్టారు. ఇలా ప్రతి అంశంలో ఎంతో సమన్వయంతో ముందుకు వెళ్లడం కలిసొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని