Gujarat Polls: ముగిసిన ప్రచారం.. తొలిపోరుకు గుజరాత్‌ సిద్ధం

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. డిసెంబర్‌ 1న జరగనున్న పోలింగ్‌కు నేడు ప్రచారం ముగిసింది. ఇందుకోసం రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారాన్ని చేశాయి.

Published : 29 Nov 2022 19:51 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ముమ్మర ప్రచారంతో దూసుకెళ్లిన ప్రధాన రాజకీయ పార్టీలు.. తొలిదశ ప్రచారానికి ముగింపు చెప్పాయి. భాజపా తరఫున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు భావ్‌నగర్‌, కచ్‌ జిల్లాలోని గాంధీధామ్‌లలో నేడు ప్రచారం నిర్వహించారు. మొదటి దశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరగనుంది. మరో 93 స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుండగా.. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తొలిదశలో ఆమ్‌ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ బరిలో ఉన్నారు. ద్వారకా జిల్లాలోని ఖాంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గుజరాత్‌ మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన కున్వార్‌జీ బవాలియా, మోర్బీ హీరో కాంతీలాల్‌ అమృతీయ, క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రివాబా, ఆమ్‌ఆద్మీ పార్టీ గుజరాత్‌ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా వంటి ముఖ్య వ్యక్తులు తొలిదశ పోటీలో ఉన్నారు.

భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు భాజపా సీనియర్‌ నేతలు ప్రచారాన్ని నిర్వహించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ముమ్మర ప్రచారాన్ని చేసుకుంటూ.. పలు ఉచిత హామీలను గుప్పించారు. ఇక కాంగ్రెస్‌ తరఫున పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ వంటి సీనియర్‌ నేతలు ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని