YSRCP: ఏడో జాబితాపై కసరత్తు.. సీఎం జగన్‌తో బాలినేని, వల్లభనేని, కొడాలి నాని చర్చలు!

వైకాపాలో పలు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల మార్పు కొనసాగుతోంది.

Published : 12 Feb 2024 20:06 IST

అమరావతి: వైకాపాలో పలు లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్‌ఛార్జుల మార్పు కొనసాగుతోంది. ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించి 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలపై వేటు వేసిన ముఖ్యమంత్రి జగన్‌.. మరికొంత మందిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పలు మార్పులతో ఏడో జాబితాను రూపొందిస్తున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేయనున్న నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంతో సీఎంను వారంతా కలిశారు.

ప్రకాశం జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతున్నాయి. ఇందుకోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన కుమారుడిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీగా పార్టీ దాదాపుగా నిర్ణయించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి అభ్యర్థిత్వాన్ని బాలినేని వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం మాత్రం చెవిరెడ్డిని తప్పించేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే తానే ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని బాలినేని ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. ఈ అంశంపైనా సీఎంవోలో బాలినేని చర్చించారని తెలిసింది.

గత ఎన్నికల్లో తెదేపా నుంచి గెలిచి వైకాపాకు మద్దతిస్తోన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌ను కలిసి తన సీటు విషయమై చర్చించారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పలు అంశాలపై చర్చించారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ను మార్చాలని యోచిస్తోన్న జగన్‌.. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. టికెట్ కోల్పోయిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ సీఎంను కలిసి తనకు ఎక్కడో ఓ చోట టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని