Purandeshwari: ఐదేళ్ల దోపిడీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే

ఎన్డీయే కూటమిలోని మూడు పార్టీల ఆలోచనా విధానాలు, పనితీరు వేరు కావొచ్చు.. అయినా ఎన్నికలలో చక్కటి సమన్వయంతో ముందుకెళ్లి అనూహ్య విజయం సాధించామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం విజేత పురందేశ్వరి పేర్కొన్నారు.

Published : 06 Jun 2024 03:53 IST

ప్రజా సమస్యలను నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

సమావేశంలో మాట్లాడుతున్న పురందేశ్వరి.. చిత్రంలో భాజపా  రాష్ట్ర నాయకుడు సోము వీర్రాజు, బొమ్ముల దత్తు తదితరులు

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, దేవీచౌక్‌: ఎన్డీయే కూటమిలోని మూడు పార్టీల ఆలోచనా విధానాలు, పనితీరు వేరు కావొచ్చు.. అయినా ఎన్నికలలో చక్కటి సమన్వయంతో ముందుకెళ్లి అనూహ్య విజయం సాధించామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం విజేత పురందేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో పార్టీ శ్రేణులతో బుధవారం ఆమె సమావేశమయ్యారు. జనసేన తొలినుంచీ భాజపాతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికలకు తెదేపాతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుందని, కాస్త ఆలస్యంగా భాజపా కూటమిలో చేరిందని అన్నారు. కార్యకర్తలు తొలుత కొంత ఇబ్బందిపడ్డప్పటికీ మూడు పార్టీల అగ్రనాయకత్వం అందరినీ సమన్వయం చేసి ముందుకు నడిపిందని వివరించారు. ‘ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన తప్పిదాలు, కక్షపూరిత చర్యలు మనకు గుణపాఠం. మనమూ అలాగే వెళ్లాలని కొందరంటున్నారు. ప్రతిపక్షాలపై వైకాపా వారు కేసులు నమోదు చేశారు. కారణం లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు’ అని పురందేశ్వరి గుర్తుచేశారు. అంతటి విద్వేషపూరితంగా మనం వెళ్లాల్సిన అవసరం లేదని, అవినీతిపై చట్టపరంగా విచారించాలని అభిప్రాయపడ్డారు. వైకాపా వారు ప్రకృతి సంపద దోచుకున్నారని, కేంద్ర నిధులను పక్కదోవ పట్టించారని.. వీటన్నింటిపై త్వరలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన భాజపా అభ్యర్థులు మిత్రపక్షంగా ఉంటూనే ప్రజల సమస్యలను నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని అన్నారు. వైకాపాకు భాజపా అనుకూలంగా ఉందన్న అపోహలను రాజమహేంద్రవరంలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ, ఇతర వేదికలపై అమిత్‌షా తొలగించారని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని