Lok Sabha Election Results: సినీ ప్రముఖుల గెలుపోటములు ఇలా..

Lok Sabha Election Results: ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సినీ ప్రముఖుల పరిస్థితి ఏంటీ..? ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు?

Updated : 05 Jun 2024 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ లోక్‌సభ ఎన్నికల్లో సినీరంగానికి చెందిన పలువురు తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వెండితెర, బుల్లితెరపై మెరిసి ప్రేక్షకులకు చేరువైన నటీనటులు పలు పార్టీల నుంచి పోటీ చేశారు. మరి వారి గెలుపోటములు ఎలా ఉన్నాయి. ఈసారి లోక్‌సభకు అడుగుపెట్టే తారలు ఎవరంటే..?

 • హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (భాజపా తరఫున) అరంగేట్రంలోనే విజయం సాధించారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
 • టీవీ రాముడిగా పేరొందిన అరుణ్‌ గోవిల్‌ (భాజపా) ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో తన సమీప ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
 • ‘డ్రీమ్‌ గర్ల్‌’ హేమామాలిని యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ముకేశ్‌ ధంగర్‌పై 2.93 లక్షల మెజార్టీ సాధించారు.

 • టీవీ నటిగా, మోడల్‌గా గుర్తింపు పొంది రాజకీయాల్లోకి వచ్చిన స్మృతి ఇరానీకి ఈసారి గట్టి షాక్‌ తగిలింది. యూపీలోని అమేఠీ నుంచి ఆమె తన ప్రత్యర్థి కిశోరీ లాల్‌ శర్మ (కాంగ్రెస్‌) చేతిలో 1.62లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
 • ‘రేసు గుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన రవికిషన్‌ గోరఖ్‌పుర్‌ (యూపీ)లో తన సమీప ప్రత్యర్థి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్‌ (ఎస్పీ)పై లక్ష ఓట్లతో గెలిచారు.
 • తెలుగులో పలు సినిమాల్లో అలరించిన నటి నవనీత్‌ రాణా వరుసగా రెండోసారి అమరావతి (మహారాష్ట్ర) నుంచి తలపడ్డారు. అయితే.. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్వంత్‌ బసవంత్‌ వాంఖడే చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
 • పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి సినీ నటి, సిట్టింగ్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ (భాజపా) మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. ఆమెకు పోటీగా టీఎంసీ మరో ప్రముఖ నటి రచనా బెనర్జీని నిలబెట్టింది. ఈ క్రమంలోనే రచన 76 వేట ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.

 • బెంగాల్‌లోని ఘటల్‌ నుంచి తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్‌ అధికారి అలియాస్‌ దేవ్‌ తన సమీప భాజపా అభ్యర్థి, సినీ నటుడు హిరణ్మయ్‌ ఛటోపాధ్యాయపై 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు.
 • సీనియర్‌ సినీ నటుడు, అసన్‌సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా (టీఎంసీ) వరుసగా రెండోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి ఎస్‌ఎస్‌ అహ్లూవాలియాపై దాదాపు 60వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
 • నార్త్‌ ఈస్ట్‌ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,38,778 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
 • కేరళలోని త్రిసూర్‌ నుంచి రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ మలయాళ నటుడు సురేశ్‌ గోపి (భాజపా) 74వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
 • కేరళలోని కొల్లంలో సినీ నటుడు కృష్ణ కుమార్‌ భాజపా నుంచి, మరో సినీ నటుడు ఎం.ముఖేశ్‌ సీపీఎం నుంచి పోటీ చేయగా.. వీరిని గెలుపు వరించలేదు.
 • తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, తమిళ నటుడు విజయ్‌ వసంత్‌ తన సమీప భాజపా అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌పై 1,79,097 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
 • తమిళనాడులోని కడలూర్‌ నుంచి భాజపా మిత్రపక్షం పీఎంకే తరఫున సినీ నటుడు, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ తంగర్‌ బచన్‌ పోటీ చేయగా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 • కర్ణాటకలోని శివమొగ్గ నుంచి కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ సతీమణి గీతా శివరాజ్‌ కుమార్‌.. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర చేతిలో ఓటమిపాలయ్యారు.
 • పశ్చిమ బెంగాల్‌లోని బహరంపుర్‌ నుంచి అధిర్‌ రంజన్‌ చౌధరీ (కాంగ్రెస్‌)పై మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ (టీఎంసీ) 85, 022 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు