మోదీ 3.0: ప్రధానితో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీరేనా?

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీ (Modi 3.0) మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు 30 మంది ప్రమాణం చేయనున్నారు.

Updated : 09 Jun 2024 16:23 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ (Modi 3.0) మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు 30 మంది ప్రమాణం చేయనున్నారు. భాజపాకు సొంతంగా మెజారిటీ రానుందన ఈసారి భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో కీలక శాఖలైన హోం, ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను అట్టిపెట్టుకుని.. కూటమిలోని పార్టీలకు కొన్ని మంత్రి పదవులు కేటాయించనుంది.

మోదీ 3.0లో భాజపా నుంచి మరోసారి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు మరోసారి రక్షణ మంత్రిత్వ బాధ్యతలు అప్పగిస్తారని వినికిడి. ఆయనతో పాటు అమిత్‌షా, గడ్కరీ, జైశంకర్‌, నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, పీయూష్‌ గోయల్‌, హర్దీప్‌ సింగ్‌ పురీ, జ్యోతిరాదిత్య సింథియా, అశ్వనీ వైష్ణవ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, సీఆర్‌ పాటిల్‌, కిరణ్‌ రిజిజు మోదీ కేబినెట్‌లో ఉండే అవకాశం ఉంది. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, జేపీ నడ్డాను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు అర్జున్‌ మేఘవాల్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, రావు ఇంద్రజీత్‌ సింగ్‌, కమలాజీత్‌ సెహర్వాత్‌, భూపేంద్ర యాదవ్‌, ఎల్‌ మురగన్‌, ప్రహ్లాద్‌ జోషి, శోభా కర్లాంద్లజె, నిముబెన్‌ బంబానియా, జువల్‌ ఓరం, వి సోమన్న వంటి నేతలకు బెర్త్‌ దక్కే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనురాగ్‌ ఠాకూర్‌, పరుషోత్తం రూపాలా వంటి వారికి ఈ జాబితాలో చోటు దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సారి ఏకంగా ఐదుగురికి మంత్రివర్గంలో ఛాన్స్‌ దక్కనుంది. ఏపీలో తెదేపా నుంచి రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భాజపా నుంచి శ్రీనివాస వర్మకు మంత్రివర్గం బెర్త్‌ ఖరారైనట్లు సమాచారం. తెలంగాణలో భాజపా నుంచి గెలుపొందిన కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ను ఈ సారి కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు వారికి ఆహ్వానం అందింది. కూటమి పార్టీల నుంచి హెచ్‌డీ కుమార స్వామి (జేడీఎస్‌), చిరాగ్‌ పాసవాన్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, జితన్‌ రాం మాంఝీ, జయంత్‌ చౌధరి (ఆర్‌ఎల్డీ), అనుప్రియా పటేల్‌, ప్రతాప్‌ రావు జాదవ్‌ (శివసేన- శిందే), లలన్‌ సింగ్‌, రామ్‌దాస్‌ అథవలె (రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) వంటి పేర్లు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని