Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్, భాజపా హోరాహోరీ

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపింది. మొదటి నుంచి చివరి రౌండ్‌ వరకు అభ్యర్థుల మధ్య తేడా స్వల్పంగానే ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి పెరుగుతూ పోయింది.

Updated : 05 Jun 2024 09:29 IST

చివరకు 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ గెలుపు
నోటాకు ఆరోస్థానం.. 4,330 ఓట్లు

మహబూబ్‌నగర్‌లో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న డీకే అరుణ

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపింది. మొదటి నుంచి చివరి రౌండ్‌ వరకు అభ్యర్థుల మధ్య తేడా స్వల్పంగానే ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి పెరుగుతూ పోయింది. చివరకు భాజపా అభ్యర్థి డీకే అరుణ.. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిపై 4,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భారాస మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తం 21 రౌండ్లలో లెక్కింపు జరిగింది. మొదటి నాలుగు రౌండ్ల వరకు డీకే అరుణ ఆధిక్యం చూపారు. ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. తర్వాత మూడు రౌండ్లలో మళ్లీ భాజపా ఆధిక్యం కొనసాగింది. అప్పటికే డీకే అరుణ 18,388 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 9వ రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి 5,453 ఓట్ల మెజార్టీ వచ్చింది. 11వ, 12వ రౌండ్లలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యత కొనసాగింది. 12వ రౌండుకు వచ్చే సరికి భాజపా ఆధిక్యత 8,101కు పడిపోయింది. 13, 14, 18వ రౌండ్లలో భాజపా, 15, 16, 17, 19, 20, 21వ రౌండ్లలో కాంగ్రెస్‌కు లీడ్‌ వచ్చింది. చివరి రౌండ్‌ తర్వాత మొత్తం 3,636 ఓట్లతో భాజపా ఆధిక్యంలో ఉంది. అప్పటికింకా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. దీంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 8,708 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పడగా అందులో డీకే అరుణకు 4 వేలు, వంశీచంద్‌రెడ్డికి 3,136 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి 4,500 మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. ఇక్కడ నోటాకు 4,330 ఓట్లు రావడం గమనార్హం. మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీ చేయగా నోటా ఆరో స్థానంలో నిలిచింది. 

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి..

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉండటంతో ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి పోటీలో నిలిచారు. ఆయన గెలుపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. లోక్‌సభ పరిధిలోని జడ్చర్ల మినహా మహబూబ్‌నగర్, దేవరకద్ర, షాద్‌నగర్, మక్తల్, కొడంగల్, నారాయణపేట శాసనసభ నియోజకవర్గాల్లో సీఎం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌కి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రధానంగా కొడంగల్, జడ్చర్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రధాని మోదీ నారాయణపేటలో ప్రచారం చేయడం భాజపాకు కలిసి వచ్చింది. 

ఆరో ప్రయత్నంలో డీకే అరుణ కుటుంబానికి విజయం

డీకే అరుణ తమ కుటుంబం నుంచి ఆరో ప్రయత్నంలో ఎట్టకేలకు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె 1996లో మహబూబ్‌నగర్‌ నుంచి తెదేపా తరఫున పోటీచేసి కేంద్ర మాజీ మంత్రి జి.మల్లికార్జున్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో భాజపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోగా తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. అంతకుముందు ఆమె మామ డి.కె.సత్యారెడ్డి (డి.కె.భరత్‌సింహారెడ్డి తండ్రి) 1962, 1971, 1977లో మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని