Exit Polls: బెడిసికొట్టిన ఎగ్జిట్‌పోల్స్‌

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దాదాపు అన్ని సర్వే సంస్థల అంచనాలు బెడిసికొట్టాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైన ఫలితాలకు వ్యత్యాసం భారీగా కనిపించింది.

Updated : 05 Jun 2024 05:53 IST

వాస్తవ ఫలితాలతో పోలిస్తే భారీ వ్యత్యాసం
పెద్ద రాష్ట్రాల్లో అంచనాలన్నీ విఫలం

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దాదాపు అన్ని సర్వే సంస్థల అంచనాలు బెడిసికొట్టాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైన ఫలితాలకు వ్యత్యాసం భారీగా కనిపించింది. అన్ని సర్వే సంస్థలు ఎన్డీయే కూటమి విజయాన్ని ఊహించినప్పటికీ సీట్ల విషయంలో వాటి అంచనాలు తారుమారయ్యాయి. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య స్వల్ప అంతరాన్ని వెల్లడించడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయి. భాజపా కూటమి 300కు పైగా సీట్లను గెలుచుకుంటుందని అన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా ఆ మార్కును సైతం అందుకోలేకపోవడం గమనార్హం.

‘ఇండియాటుడే యాక్సిస్‌ మై ఇండియా’ సర్వే సంస్థ అధికార భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 361-401 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమి 131-166 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. టైమ్స్‌ నౌ-ఈటీజీ రీసెర్చ్‌ తమ సర్వేలో ఎన్డీయేకు 358, ఇండియా కూటమికి 152 సీట్లు వస్తాయని చెప్పింది. రిపబ్లిక్‌ టీవీ పీ మార్క్‌ సైతం దాదాపు ఇదే సంఖ్యతో ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేసింది. ‘టుడేస్‌ చాణక్య’ సంస్థ ఎన్డీయేకు 400 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 107 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జన్‌కీబాత్‌ తమ సర్వే ప్రకారం భాజపా కూటమికి 390 సీట్లు, ప్రతిపక్ష కూటమికి 161 వస్తాయని తెలిపింది. న్యూస్‌ నేషన్‌ సంస్థ ఎన్డీయేకు 378, ఇండియా కూటమికి 169 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, రాజస్థాన్‌లలో ఓటర్ల ఆంతర్యం పసిగట్టడంలో సర్వే సంస్థలు బోల్తాపడ్డాయి. ఈ రాష్ట్రాల్లో భాజపా ఏకపక్షం విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేయగా కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధించి భాజపా దూకుడుకు కళ్లెం వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు