BJP: భాజపాను దెబ్బకొట్టినవి ఆ రెండే!

ఏ ఉత్తర భారతమైతే రెండు ఎన్నికల్లో భాజపాకు ఘన విజయం సాధించి పెట్టిందో అదే ప్రాంతం ఈసారి దెబ్బకొట్టింది. అయోధ్యలో రామాలయం నిర్మించామని విస్తృత ప్రచారం చేసుకున్నప్పటికీ కాషాయదళానికి కలిసి రాలేదు.

Published : 05 Jun 2024 05:00 IST

రిజర్వేషన్ల భయం, రైతుల ఆగ్రహంతో తగ్గిన సీట్లు
సొంత మెజార్టీకి గండి కొట్టినవి అవే
కాషాయ పార్టీని కాపాడని అయోధ్య రాముడు

ఈనాడు, దిల్లీ: ఏ ఉత్తర భారతమైతే రెండు ఎన్నికల్లో భాజపాకు ఘన విజయం సాధించి పెట్టిందో అదే ప్రాంతం ఈసారి దెబ్బకొట్టింది. అయోధ్యలో రామాలయం నిర్మించామని విస్తృత ప్రచారం చేసుకున్నప్పటికీ కాషాయదళానికి కలిసి రాలేదు. గత రెండు ఎన్నికల్లో యూపీలో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలబడిన భాజపా ఈసారి సగానికి సగం బలం కోల్పోయి, సమాజ్‌వాదీపార్టీ సరసన నిలబడాల్సి వచ్చింది. గత నవంబరులో రాజస్థాన్‌ ఎన్నికల్లో అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పది సీట్లను అక్కడ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలో ప్రత్యర్థి పార్టీలను చీలికలు పేలికలు చేసినందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీని కేసులతో ముప్పుతిప్పలు పెట్టి పైచేయి సాధించాలని చూసినా ఫలితం లేకుండాపోయింది. రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూసినందుకు హరియాణాలో సగం సీట్లను, పంజాబ్‌లో ఉన్న రెండు సీట్లనూ కోల్పోవాల్సి వచ్చింది. 

ఆ అయిదు రాష్ట్రాల్లో పెరిగిన ఆదరణ 

ఈసారి మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు భాజపాను ఎక్కువ ఆదరించి, క్రితంసారి కంటే ఎక్కువ సీట్లను కట్టబెట్టాయి. మధ్యప్రదేశ్‌లో గత రెండు ఎన్నికల్లో సాధ్యంకాని 100% ఫలితాలను ఈసారి సాధించి ఆ రాష్ట్రంపై కాషాయదళం మరోసారి పట్టు సాధించింది. దిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపురల్లో క్రితంసారి ఉన్న సీట్లను చేజిక్కించుకొని అక్కడి రాజకీయాలపై పట్టును నిలుపుకొంది. కేరళలో బోణీకొట్టి అసాధ్యం అనుకున్న చోట అడుగుపెట్టగలిగింది. తెలంగాణలో సంఖ్యాబలాన్ని రెట్టింపు చేసుకొని ఆ రాష్ట్ర రాజకీయాలను త్రిముఖం నుంచి ద్విముఖంగా మలుపుతిప్పగలిగింది. ఎస్టీలు అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో క్రితంసారి కంటే ఒకసీటు అధికంగా గెలుచుకొని పైచేయి సాధించిన భాజపా.. ఝార్ఖండ్‌లో మాత్రం అక్కడి ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపినందుకు మూడు సీట్లను కోల్పోవాల్సి వచ్చిందనే విశ్లేషణ వినిపిస్తోంది. కర్ణాటకలోనూ  ప్రజ్వల్‌ రేవణ్ణ ఉదంతంతో 9 సీట్లను కోల్పోయి భారీగా నష్టపోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. 

ఒక్కో రాష్ట్రం.. భిన్న కారణం 

బిహార్‌లో గతసారి 17కి 17 సీట్లు గెలుచుకొని పెద్దన్న పాత్ర పోషించిన భాజపా ఇప్పుడు 5 సీట్లను కోల్పోయి మణిపుర్‌ అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపినా కేంద్రంలోని భాజపా నాయకత్వం దాన్ని పెద్ద తీవ్రంగా తీసుకోలేదు. అక్కడ అంతా ప్రశాంతంగానే ఉందని చూపేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అక్కడ రెండుస్థానాల్లోనూ కాంగ్రెస్‌ గెలిచింది. అస్సాంను దృష్టిలో ఉంచుకొని తెచ్చిన సీఏఏ కారణంగా ఆ రాష్ట్రంలోనూ ఒక సీటును కోల్పోవాల్సి వచ్చింది. ఆర్టికల్‌ 370ని రద్దుచేసి, జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసినప్పటికీ లద్దాఖ్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైనందుకు అక్కడి స్థానాన్ని కాషాయదళం వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భాజపాకు అంత బలం వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లను రద్దుచేస్తారని ప్రతిపక్షాలు చేసిన ప్రచార ప్రభావం ఎస్సీ, ఓబీసీలు అధికంగా ఉండే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లపై బలంగా పడింది. అగ్నివీర్‌ పథకం పలుచోట్ల వ్యతిరేక ప్రభావం చూపించింది. ముఖ్యంగా యూపీలో భాజపా బలం సగానికి సగం తగ్గిపోయింది. రెండుసార్లు 26కి 26 స్థానాలు గెలిచిన గుజరాత్‌లో ఈసారి ఒక సీటును భాజపా నష్టపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా నష్టపోవడానికి మోదీ వ్యవహారశైలి ఎంత కారణమైందో, కొత్తగా కొన్ని రాష్ట్రాల్లో బలపడటానికి అంతే దోహదం చేసిందని చెప్పవచ్చనేది విశ్లేషకుల మాట. సుదీర్ఘకాలం సేవలందించిన నేతలను ఒక్కసారిగా పక్కనపెట్టడం కూడా బెడిసికొట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని