Lok Sabha Elections: నేడే ఆరోవిడత.. 58 స్థానాలకు జరగనున్న పోలింగ్‌

దేశమంతటా ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చేస్తున్నాయి! ఆరో విడతలో భాగంగా- ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరగనుంది.

Updated : 25 May 2024 07:02 IST

దిల్లీలోని పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో తరలివెళ్తున్న సిబ్బంది

దిల్లీ, జమ్మూ: దేశమంతటా ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చేస్తున్నాయి! ఆరో విడతలో భాగంగా- ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. దేశ రాజధాని దిల్లీ, హరియాణాల్లోని అన్ని నియోజకవర్గాలకు ఈ దశలోనే ఓటింగ్‌ పూర్తికానుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను మొత్తం ఏడు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఆరో దశతో 486 సీట్లకు పోలింగ్‌ పూర్తవుతుంది. 

హస్తినలో హోరాహోరీ 

దిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్నింటా భాజపా, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్యే పోరు కేంద్రీకృతమైంది. పొత్తులో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 4, కాంగ్రెస్‌ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. భాజపా అభ్యర్థులకు వారు గట్టి సవాలు విసురుతున్నారు. లోక్‌సభ  ఎన్నికల నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి అంగరక్షక దళం ఛేంజ్‌ ఆఫ్‌ గార్డ్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. హరియాణాలో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్న జంగల్‌ మహల్‌ ప్రాంతంలోని 8 స్థానాలకు ఆరో విడతలో ఓటింగ్‌ జరగనుంది.  

జమ్మూకశ్మీర్‌లో బహుళ అంచెల భద్రత 

జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన అనంతనాగ్‌-రాజౌరీ స్థానంలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా మొత్తం 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఈసీ బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లుచేసింది. మరోవైపు- ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా శనివారం పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని