Bihar: బిహార్‌లో కీలక పోరు!

బిహార్‌లో చివరిదైన కీలక పోరుకు రంగం సిద్ధమైంది. 8 నియోజకవర్గాల్లో 1వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మొత్తం 134 మంది పోటీలో ఉన్నారు.

Published : 27 May 2024 05:18 IST

1 న చివరి విడత పోలింగ్‌కు సిద్ధం
లాలు, నీతీశ్‌లకు ఉత్కంఠ
8 చోట్ల బరిలో 134 మంది

బిహార్‌లో చివరిదైన కీలక పోరుకు రంగం సిద్ధమైంది. 8 నియోజకవర్గాల్లో 1వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మొత్తం 134 మంది పోటీలో ఉన్నారు. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోరు సాగనుంది. ఈ విడతలో లాలూ కుమార్తె మీసా భారతి, నీతీశ్‌ సొంత నియోజకవర్గం ఉండటంతో వారిలో టెన్షన్‌ నెలకొంది. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ తనయుడు, బాబు జగ్జీవన్‌రామ్‌ మనవడైన అన్షుల్‌ అవిజీత్‌ ఈ విడతలో బరిలో ఉన్నారు. ఎన్డీయే, ఇండియా కూటమి నేతల విస్తృత ప్రచారంతో నియోజకవర్గాలు హోరెత్తుతున్నాయి.

వ్యవసాయమే దన్ను

అత్యంత పురాతన, ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉన్న నలందా ప్రాంతంలో సారవంతమైన భూములున్నాయి. వ్యవసాయమే ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోంది. వరి, గోధుమ, పప్పులు ప్రధాన పంటలు. పండ్లు, కూరగాయల సాగూ అధికంగానే ఉంటుంది. బౌద్ధులకు, జైన్లకు పవిత్ర స్థలంగా ఉంది.  

2014, 2019లలో జేడీయూ విజయం సాధించింది. ఇప్పటికే  మూడు సార్లు గెలిచిన కౌసలేంద్ర కుమార్‌ మరోసారి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఇండియా కూటమిలోని సీపీఐ (మార్క్సిస్ట్‌-లెనినిస్ట్, లిబరేషన్‌) తరఫున సందీప్‌ సౌరభ్‌ పోటీ చేస్తున్నారు. సొంత జిల్లా కావడంతో నీతీశ్‌కు గట్టి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు నెలకొంది. ఆయన బలమే జేడీయూ అభ్యర్థికి అనుకూలాంశం. నీతీశ్‌ ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కూడా కలిసివచ్చేదే.


కాయస్థల ఆధిపత్యం

రాజధాని పట్నాలో ఉన్న పట్నా సాహిబ్‌లో కాయస్థ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. వారి తర్వాత యాదవులు, రాజ్‌పూత్‌లు అధికంగా ఉంటారు. కాయస్థలు ఎటు మొగ్గు చూపితే వారిదే విజయం. మొత్తం 21లక్షల మంది ఓటర్లలో 5 లక్షల మంది కాయస్థలే. ఎస్సీలూ ఫలితాన్ని ప్రభావితం చేయగలిగే స్థాయిలోనే ఉన్నారు. 

2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ తనయుడు అన్షుల్‌ అవిజీత్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బరిలో నిలిచారు. గత రెండు ఎన్నికల్లో భాజపాకు మద్దతిచ్చిన కాయస్థలు ఈసారి ఎవరి పక్షాన నిలుస్తారనేది ఆసక్తికరం. అన్షుల్‌ కుశ్వాహా వర్గానికి చెందినవారు. రవిశంకర్‌ కాయస్థ వర్గంవారు. 


యాదవుల పట్టు

రాజధానిలోని మరో నియోజకవర్గం పాటలిపుత్ర. ఇక్కడి 16.5 లక్షల మంది ఓటర్లలో 4లక్షల మంది యాదవులే. 3 లక్షల మంది భూమిహార్లు, లక్ష మంది బ్రాహ్మణులు, 1.7 లక్షల మంది కుర్మీలు ఉన్నారు.

2014, 2019లలో భాజపా నేత రాంకృపాల్‌ యాదవ్‌ గెలిచారు. మళ్లీ ఆయనే పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ నుంచి లాలూ కుమార్తె మీసా భారతి బరిలోకి దిగారు. మరోసారి గెలుస్తామనే ధీమా భాజపాలో కనిపిస్తోంది. రాంకృపాల్‌కు క్షేత్రస్థాయిలో మంచి పట్టు ఉంది.  తమకు గతంలో అండగా నిలిచిన ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలవాలని ఆర్జేడీ ప్రయత్నిస్తోంది.


సాగు భూమైన అడవి

ఒకప్పుడు బక్సర్‌లో అత్యధిక అటవీ ప్రాంతం ఉండేది. దానిని సాగు భూమిగా మార్చడంతో అడవులు తగ్గిపోయాయి. ఇక్కడి అడవుల్లో మామిడి, నువ్వులు, వెదురు లభిస్తాయి. గతంలో ఇక్కడ దాదాపు అన్ని పార్టీలూ గెలిచాయి. 

2014, 2019లలో భాజపా నేత అశ్వినీ కుమార్‌ చౌబే గెలిచారు. ప్రస్తుతం భాజపా తరఫున మిథిలేశ్‌ తివారీ, ఆర్జేడీ నుంచి సుధాకర్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది.

ధాన్యాగారం

ధాన్యాగారంగా పేరు పొందిన సాసారాం పర్యాటక ప్రాంతం కూడా. ఎస్సీలకు రిజర్వు అయిన ఈ నియోజకవర్గం నుంచి బాబూ జగ్జీవన్‌ రామ్, ఆయన కుమార్తె మీరా కుమార్‌ ఎంపీలుగా గెలిచారు. 19,04,173 ఓట్లున్న సాసారాంలో ఎస్సీ వర్గాల వారిదే ఆధిపత్యం. చామర్, కుశ్వాహాలు అధికంగా ఉంటారు. ఆ తర్వాత వైశ్యుల జనాభా అధికం. ఇక్కడ రైతుల సమస్యలే ఎన్నికల ఎజెండా.

2014, 2019లతోపాటు మొత్తం నాలుగుసార్లు ఛేదీ ప్రసాద్‌ ఇక్కడి నుంచి భాజపా ఎంపీగా గెలిచారు. ఈసారి ఆయనకు పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. భాజపా నుంచి శివేశ్‌ కుమార్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మనోజ్‌ కుమార్‌ తలపడుతున్నారు. దళితుల ఓట్లు ఎవరికి దక్కుతాయనే దానిని బట్టే ఇక్కడి ఫలితం ఆధారపడి ఉంది. ఒకప్పుడు ఇది కాంగ్రెస్‌కు కంచుకోట.


వ్యాపార కేంద్రం

భోజ్‌పుర్, ఔరంగాబాద్‌లకు రోడ్డు కనెక్టివిటీ ఉండటంతో కారాకాట్‌ వ్యాపార కేంద్రంగా ఎదిగింది. అయితే రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సౌకర్యాల లేమి, శాంతి భద్రతల సమస్య ఇక్కడి ఇక్కట్లు. కొయిరీ (కుశ్వాహా), రాజ్‌పూత్, యాదవ వర్గానికి చెందిన వారు రెండేసి లక్షల మంది ఉన్నారు.  

2014లో ఆర్‌ఎల్‌ఎస్‌పీ నేత ఉపేంద్ర కుశ్వాహా, 2019లో జేడీయూ నేత మహాబలి సింగ్‌ గెలిచారు. ఈసారి ఇండియా కూటమిలోని సీపీఐ (ఎంఎల్‌-ఎల్‌) నుంచి రాజా రాంసింగ్, రాష్ట్రీయ లోక్‌ మోర్చా (గతంలో ఆర్‌ఎల్‌ఎస్‌పీ) తరఫున ఉపేంద్ర కుశ్వాహా పోటీ చేస్తున్నారు. భాజపా టికెట్‌ ఇవ్వకపోవడంతో భోజ్‌పురీ నటుడు పవన్‌సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రధాన అభ్యర్థులిద్దరికీ గట్టి పోటీ ఇస్తున్నారు. కుశ్వాహా వర్గానికి చెందిన రాజా రాంసింగ్‌ ముస్లిం, యాదవ్‌ ఓట్లపై ఆధారపడుతున్నారు. పవన్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ వర్గానికి చెందినవారు. ఆయన భాజపా ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నీతీశ్‌ తదితర అగ్ర నేతలంతా కారాకాట్‌లో ప్రచారం చేస్తున్నారు. 


నక్సల్స్‌ ప్రభావం

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన జహానాబాద్‌.. శాంతి భద్రతల పరంగా అత్యంత సున్నితమైన నియోజకవర్గం. లెఫ్ట్‌ పార్టీలకు చాలా కాలంగా కంచుకోటగా నిలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్, జనతాదళ్‌ గెలిచాయి. అప్పటి నుంచీ ఏ ఒక్కరూ రెండుసార్లు గెలవలేదు.

2014లో ఆర్‌ఎల్‌ఎస్‌పీ, 2019లో జేడీయూ గెలిచాయి. ఈసారి జేడీయూ తరఫున చందేశ్వర్‌ ప్రసాద్, ఆర్జేడీ నుంచి సురేంద్ర ప్రసాద్‌ బరిలో నిలిచారు. ఆర్జేడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునీలాల్‌ యాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.  మరోవైపు లోక్‌ జన్‌ శక్తి నేత అరుణ్‌ కుమార్‌ ఎన్డీయేను వీడి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.


గంగా పరీవాహక ప్రాంతం

గంగా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం ఆరా. ఆహార ధాన్యాల వ్యాపార కేంద్రం. భోజ్‌పుర్‌ జిల్లాలోకి వస్తుంది. వెనుకబడిన వర్గాలవారు, ముస్లింలు, యాదవులు, క్షత్రియులు ఇక్కడి ఫలితాన్ని శాసిస్తారు. 

2014, 2019లలో భాజపా గెలిచింది. ప్రస్తుతం భాజపా తరఫున ఆర్‌కే సింగ్, ఇండియా కూటమిలోని సీపీఐ (ఎంఎల్‌-ఎల్‌) నుంచి సుధామ ప్రసాద్‌ బరిలో ఉన్నారు. మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని ఆర్‌కే సింగ్‌ తలపోస్తున్నారు. 2019 బిహార్‌ వరదల్లో అసామాన సేవలందించిన సుధామ ప్రసాద్‌ సామాన్యుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అదే తనను గెలిపిస్తుందని ఆయన భావిస్తున్నారు.


ఏ కూటమిలో ఎవరు?

ఎన్డీయే

భాజపా, జేడీయూ, లోక్‌ జన్‌ శక్తి, హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా, రాష్ట్రీయ లోక్‌ మోర్చా.

ఇండియా

ఆర్జేడీ, కాంగ్రెస్, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌).


ఈనాడు ప్రత్యేక విభాగం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని