Himachal Pradesh: హిమగిరుల్లో గెలుపెవరిది?

ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ ఒక్కటే. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 68 సీట్లలో 40 గెలుచుకుని అధికారం చేపట్టింది. అయితే గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 4 స్థానాలను భాజపా గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.

Published : 28 May 2024 06:02 IST

భాజపా హ్యాట్రిక్‌ కొడుతుందా..
కాంగ్రెస్‌ ఖాతా తెరుస్తుందా..
హిమాచల్‌లో 4 స్థానాలకు 1న ఒకే విడతలో పోలింగ్‌

ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ ఒక్కటే. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 68 సీట్లలో 40 గెలుచుకుని అధికారం చేపట్టింది. అయితే గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 4 స్థానాలను భాజపా గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. మరోసారి అదే ప్రదర్శన కనబరిచి హ్యాట్రిక్‌ కొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్నందున లోక్‌సభ స్థానాల్లో సత్తా చాటాలని కాంగ్రెస్‌ తలపోస్తోంది. రాష్ట్రంలోని 4 లోక్‌సభ నియోజకవర్గాల్లో జూన్‌ 1వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మొత్తం 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

  • ఈ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ కాంగ్రెస్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఆ తరువాత కాంగ్రెస్, భాజపాల మధ్య అధికారం మారుతూ వస్తోంది. 
  • హిమాచల్‌ ప్రదేశ్‌ యువతలో ఎక్కువ మంది సైన్యంలో చేరుతుంటారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పట్ల వారిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. 
  • ఈసారీ భాజపా, కాంగ్రెస్‌ల మధ్యే ముఖాముఖి పోటీ జరుగుతోంది. 
  • రాష్ట్రంలో రాజ్‌పూత్‌లు 32.7%, ఎస్సీలు 25.2%, బ్రాహ్మణులు 18%, ఓబీసీలు 13.5%, ఎస్టీలు 5.7% ఉన్నారు. 
  • హిమాచల్‌లో ప్రధాన అంశాలు.. వరద సహాయక చర్యలు, అగ్నిపథ్, యాపిల్‌ తోటల రైతుల కష్టాలు.
  • గత ఎన్నికల సమయంలో పుల్వామా దాడి, బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు ప్రభావం చూపాయి. 
  • అయోధ్యలో రామ మందిర నిర్మాణం, మైనారిటీలను కాంగ్రెస్‌ బుజ్జగిస్తోందనే ఆరోపణలు, ఆర్టికల్‌ 370 రద్దు వంటి అంశాలను భాజపా నమ్ముకుంటోంది. 

సైనిక సేవలో..

హమీర్‌పుర్‌ ప్రాంతానికి చెందిన అనేక మంది సైన్యంలో సేవలందిస్తారు. వ్యవసాయం, కుటీర పరిశ్రమలే ఇక్కడ ఉపాధి మార్గం. విద్యా కేంద్రంగానూ ఉంది. పర్యాటక కేంద్రంగానూ ప్రసిద్ధి. ఇక్కడ అక్షరాస్యత 89శాతం. తొలి నుంచీ ఇక్కడ భాజపాదే ఆధిపత్యం. 16సార్లు ఎన్నికలు జరిగితే 10సార్లు ఆ పార్టీయే విజయం సాధించింది. కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్, ఆయన తండ్రి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ చెరో మూడు సార్లు గెలిచారు. 

2009, 2014, 2019లలో గెలిచిన అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి సత్పాల్‌ రాయ్‌జాదా పోటీ చేస్తున్నారు. పదేళ్లుగా కేంద్రంలో మంత్రిగా ఉన్న ఠాకుర్‌ ఈ ప్రాంతంలో తన బలాన్ని పెంచుకున్నారు. ఆయనను ఢీకొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని బరిలోకి దింపింది. దీంతో ఉత్కంఠ నెలకొంది.


ఎక్కడ ఎంత మంది పోటీ?

తేయాకు తోటల క్షేత్రం

వ్యవసాయంపై ఆధారపడే కాంగ్డా ప్రాంతంలో తేయాకు తోటలూ అధికంగానే ఉన్నాయి. హిమాలయాలకు దగ్గరగా ఉండే ఈ ప్రాంతానికి పర్యాటకులు భారీగా వస్తుంటారు. కుటీర పరిశ్రమలూ ఉన్నాయి. బాన్‌గంగా, మాంఝీ నదుల మధ్యలో ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన కాంగ్డాలో గత కొన్ని ఎన్నికలుగా కమలం వికసిస్తోంది. 

2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి రాజీవ్‌ భరద్వాజ్, కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ బరిలో నిలిచారు. ఇద్దరూ 60ఏళ్లు దాటినవారే. ఇద్దరికీ అపార రాజకీయ అనుభవం ఉంది. భరద్వాజ్‌కు క్షేత్ర స్థాయి కార్యకర్తల బలం ఉంది. అయితే ఓబీసీ ఓట్లను సాధించడంలో ఆయన ఎంత మేరకు విజయం సాధిస్తారనేది చూడాలి. ఆనంద్‌ శర్మకు జాతీయ రాజకీయాల్లో అనుభవంతోపాటు మంచి వాగ్ధాటి ఉంది. ఎమ్మెల్యేల బలమూ ఆయన సొంతం. స్థానికంగా ఉండకపోవడం ఆయనకు వ్యతిరేక అంశం.

బ్రిటిషర్ల వేసవి రాజధాని

1864లో దేశానికి వేసవి రాజధానిగా శిమ్లాను బ్రిటిషర్లు నిర్ణయించారు. ప్రస్తుతం పర్యాటక స్వర్గ ధామంగా ఉన్న శిమ్లా హిమాచల్‌కు రాజధాని. ఎస్సీలకు కేటాయించిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, జనతాదళ్, భారతీయ లోక్‌దళ్‌ వంటి పార్టీలు గెలిచాయి. హిమాచల్‌కు శిమ్లా ఆర్థిక, రాజకీయ రాజధాని. యాపిల్‌ సాగు అధికంగా ఉంటుంది.

2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా సురేశ్‌ కుమార్‌ కాశ్యప్, కాంగ్రెస్‌ నుంచి వినోద్‌ సుల్తాన్‌పురి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ పార్టీలోని ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులకు సొంత ప్రాంతం కావడంతో ఈసారి ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. అందుకే ఎమ్మెల్యే అయిన వినోద్‌ను పోటీకి దించింది. యాపిల్‌ ధరల్లో హెచ్చుతగ్గులు ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉంది. యాపిల్‌ దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమం కూడా ఎన్నికల అంశాలే. హట్టీ వర్గానికి ఎస్టీ హోదా గత భాజపా ప్రభుత్వం ఇచ్చింది. దీనిని ప్రస్తుత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. అధ్వాన రోడ్లు, తరచూ విరిగిపడే కొండ చరియలు, జల విద్యుత్తు ప్రాజెక్టులు శిమ్లా ప్రాంతంలోని సమస్యలు. అక్రమ మైనింగ్‌ కూడా ఇక్కడ సమస్యే. ప్రమాణాలకు అనుగుణంగా లేని ఔషధాలు ఇక్కడ పెద్ద ఎత్తున తయారవుతుంటాయి. 

లిటిల్‌ కాశీ

లిటిల్‌ కాశీగా పిలిచే మండీ.. హిమాచల్‌లో అత్యంత కీలక నియోజకవర్గం. దానిని మాండవ్య నగర్‌ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం వాణిజ్యానికి ప్రసిద్ధి. వ్యవసాయం కూడా జీవనాధారమే. ధాన్యం, పప్పులు, చిరు ధాన్యాలు, తేయాకు, హెర్బల్‌ ఉత్పత్తులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇవన్నీ ఇక్కడి 80% మండీల్లో విక్రయమవుతాయి. ముడి సిల్క్‌ ఉత్పత్తీ ఇక్కడ అధికమే. 

2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా తరఫున బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్‌ నుంచి రాజ కుటుంబానికి చెందిన మాజీ సీఎం వీరభద్రసింగ్‌ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ పోటీ చేస్తున్నారు. కంగనా వివాదాస్పద వ్యాఖ్యలనే కాంగ్రెస్‌ అస్త్రాలుగా మలుచుకుంటోంది. రాజ్యసభ ఎన్నికల సమయంలో పార్టీ మారతారనే ప్రచారం విక్రమాదిత్యకు ప్రతికూలంగా మారింది. మండీ పరిధిలోని ఎక్కువ అసెంబ్లీ స్థానాలు భాజపా చేతిలో ఉండటం కంగనాకు కలిసివచ్చే అంశం. ఎగువ ప్రాంతం భాజపాకు, దిగువ ప్రాంతం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. 

ఉప ఎన్నికలతో తేలనున్న ప్రభుత్వ భవితవ్యం

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. భాజపా అభ్యర్థికి ఓటేశారు. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లోనూ, అసెంబ్లీలో బడ్జెట్‌ బిల్లుకు ఆమోదం సందర్భంలోనూ రెబల్‌ ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించడంతో వారిపై స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. దీంతో అప్పటికి ప్రభుత్వం గట్టెక్కింది. సార్వత్రిక ఎన్నికలతోపాటు ఈ ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా స్థానాల్లో పార్టీ ఫిరాయించిన వారికే భాజపా టికెట్లిచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. కాంగ్రెస్‌ విజయం సాధిస్తే ప్రభుత్వానికి ఢోకా ఉండదు. ప్రజల్లో మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని