Exit polls: ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు ఎప్పుడు..? చివరి విడత పోలింగ్‌ తరువాతే ఎందుకు?

Exit polls: దేశంలో ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకు ముందే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు రానున్నాయి.

Published : 27 May 2024 14:40 IST

Exit polls | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం (Lok Sabha polls 2024) తుది దశకు చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకెన్ని సీట్లు వస్తాయ్‌? రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అంటూ జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఈ విషయంలో ఎవరి అంచనాలు వారివి. ఎన్నికల సమయంలో వివిధ మీడియా/ ప్రైవేటు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్ (Exit polls) అంచనాలు వెలువరిస్తుంటాయి. సాధారణంగా పోలింగ్‌ జరిగిన సాయంత్రమే ఈ అంచనాలు వెలువడుతుంటాయి.

దేశంలో లోక్‌సభతో పాటు, నాలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం) అసెంబ్లీలకు కూడా పోలింగ్‌ జరుగుతోంది. జూన్‌ 1న ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తి కానుంది. ఇతర రాష్ట్రాల్లో పోలింగ్‌ ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌పై (Exit polls) ఈసీ నిషేధం విధించింది. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో అంచనాలు వెలువరించడం వల్ల ఆయా ప్రాంత ఓటర్లను ప్రభావితం అవుతారన్న కారణంతో ఈసీ చట్టంలోనే ఈ నిబంధనలున్నాయి. అందుకే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయినా.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడడం ఆలస్యం అవుతోంది. చివరి బూత్‌లో పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువరించేందుకు ఎలాంటి అడ్డంకీ ఉండదు. జూన్‌ 1న సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. 6.30 గంటల నుంచి ప్రధాన మీడియా/ ప్రైవేటు సంస్థలు తమ అంచనాలను వెలువరిస్తాయి. ఇప్పటికే ఫలానా సంస్థ ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశాయంటూ సోషల్‌మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. అవన్నీ ఫేక్‌. వాస్తవానికి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి చివరి విడత పోలింగ్‌ ముగిసేంతవరకు ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రసారం చేయకూడదు.

4న అసలు ఫలితం

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు పక్కనపెడితే అసలు ఫలితాలు వెలువడేది జూన్‌ 4న. దేశంలోని 543 లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు ఆ రోజే వెలువడతాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించాక.. తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నానికల్లా అభ్యర్థుల భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుంది. అదే రోజు రాత్రి, మరుసటి రోజు ఎన్నికల సంఘం ఓటింగ్‌ శాతాలు సహా ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తుంది. ఎన్నికల రోజు ఫలితాల లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఈనాడు.నెట్‌ వీక్షించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని