Lokesh: మంత్రివర్గంలోకి లోకేశ్‌.. చంద్రబాబు నిర్ణయం

తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. ఆయనకు ప్రాధాన్యమున్న మంత్రిత్వశాఖల బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల కథనం.

Published : 07 Jun 2024 04:02 IST

ఈనాడు, అమరావతి: తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. ఆయనకు ప్రాధాన్యమున్న మంత్రిత్వశాఖల బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల కథనం. సుదీర్ఘ పాదయాత్ర చేసి ఎన్డీయే విజయంలో కీలక భూమిక పోషించిన లోకేశ్‌ ఒక సందర్భంలో.. ఎన్నికల్లో గెలిచాక మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీపరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. తాజాగా ఓట్ల లెక్కింపు ముగిశాక విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానన్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో లోకేశ్‌ చేరతారా, లేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లో రెండురోజులుగా చర్చ జరుగుతోంది.

తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతోనే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో ఐటీ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రిగా లోకేశ్‌ బాధ్యతలు నిర్వహించారు. విశాఖ, మంగళగిరి, విజయవాడ కేంద్రాలుగా ఐటీ కంపెనీలు తీసుకురావడంలో... నరేగా, తదితర శాఖల నిధులతో గ్రామాల్లో పాతిక వేల కిలోమీటర్లకుపైగా పొడవైన అంతర్గత రహదారుల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈసారి ప్రభుత్వంలో మరింత కీలక భూమిక పోషించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు