బెంగాల్‌లో దీదీ దూకుడు.. నవీన్‌ జోరుకు భాజపా బ్రేకులు.. తమిళనాడులో డీఎంకే హవా

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజార్టీ మార్కు దాటింది. అయితే.. ఆశించిన మేర స్థానాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.

Updated : 04 Jun 2024 19:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజార్టీ మార్కు దాటినప్పటికీ.. గతంతో పోల్చితే మాత్రం సీట్లు తగ్గాయి. మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆశించిన దాని కంటే మెరుగైన ఫలితాలు సాధించి రెట్టింపు ఉత్సాహంలో ఉంది. పలు కీలక రాష్ట్రాల్లో ఫలితాల సరళిని పరిశీలిస్తే..

బెంగాల్‌లో దీదీ దూకుడు..

ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ ఒకటి. అయితే.. ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ దూకుడును భాజపా ఏమాత్రం అడ్డుకోలేక పోయింది. గత సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెరుగైన పనితీరు కనబరిచిన కమలదళం.. ఈసారి మరింత పోటీ ఇస్తుందని అంతా భావించారు.  ప్రధాని మోదీ, అమిత్‌ షా వంటి భాజపా అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృత పర్యటనలతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినప్పటికీ.. దీదీ చరిష్మాను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఇక్కడ దీదీ వర్సెస్‌ మోదీ అన్నట్లు హోరాహోరీ ప్రచారం జరిగినా.. చివరికి మమత వైపే ప్రజలు మొగ్గు చూపారు.  క్రితం లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించిన భాజపా.. ఈసారి 12 సీట్లకే పరిమితమైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ.. ఈసారి మరింత బలపడి 29 స్థానాలతో సత్తా చాటుతోంది.

కుప్పకూలిన కంచుకోట..! నవీన్‌ రికార్డుకు భాజపా బ్రేకులు..

ఒడిశాలో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఇప్పటి వరకూ ఎదురే లేకుండా దూసుకెళ్లిన అధికార బిజూ జనతాదళ్‌(BJD) అధినేత, సీఎం నవీన్‌ పట్నాయక్‌ జోరుకు భాజపా బ్రేకులు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147 స్థానాలకుగానూ కమలదళం 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ‘74’ను ఇప్పటికే దాటేసింది. బిజద కేవలం 48 స్థానాలకే పరిమితమైంది. 14 చోట్ల కాంగ్రెస్‌, ఒకచోట సీపీఎం, మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పోలిస్తే.. బిజద ఈసారి ఏకంగా 65 చోట్ల చతికిలపడటం గమనార్హం. ఆయన క్యాబినెట్‌లోని ఎనిమిది మంత్రులు ఓటమి బాటపట్టారు. మరోవైపు.. రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాల్లోనూ కాషాయ పార్టీ 19 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. బిజద ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తమిళనాడులో డీఎంకే హవా..

తమిళనాడులో డీఎంకే స్పష్టమైన హవా కనిపించింది. ఇక్కడ ఇండియా కూటమి దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. స్టాలిన్‌ నాయకత్వానికే ఇక్కడి ప్రజలు ఓటు వేశారు. మొత్తం 39 స్థానాలు ఉండగా.. కూటమి అభ్యర్థులు 38 స్థానాలతో దూసుకెళ్తున్నారు. వీటిలో కాంగ్రెస్‌వి 9 స్థానాలు ఉన్నాయి. ఇక ఇక్కడ అన్నాడీఎంకే, భాజపా ఖాతానే తెరవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

చతికిలపడ్డ ఆప్‌..

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆప్‌ పెద్దగా ప్రభావం చూపించలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో ఒక్క సీటుకే పరిమితమైన ఆప్‌.. ఈ సారి 3 సీట్లలో గెలుపొందింది. ఇక్కడ కాంగ్రెస్‌ 7 స్థానాలతో ముందుంది. ఇక దిల్లీలో మొత్తం 7 చోట్ల భాజపా అభ్యర్థులే గెలుపొందారు. ఇక్కడ ఇండియా కూటమి ప్రభావం ఏ మాత్రం లేదు.

కేరళ కాంగ్రెస్‌దే..

కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్‌ దూసుకెళ్లింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..  భాజపా ఇక్కడ తొలిసారి ఖాతా తెరిచింది. ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సురేశ్‌ గోపీ 74 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని