MLA Pinnelli: పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి విధ్వంసకాండ

అరాచకానికి, దౌర్జన్యానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు. తానో శాసనసభ్యుడినని మర్చిపోయి వీధిరౌడీలా, గూండాలా ప్రవర్తించారు.

Updated : 22 May 2024 06:50 IST

ఎన్నికల రోజు పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌లను నేలకేసి కొట్టి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే
వెబ్‌కెమెరాల్లో రికార్డయిన ఘటన
గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టిన పోలీసులు
వీడియో బహిర్గతమవడంతో తప్పనిసరై ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చిన వైనం
ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ
ఈనాడు - అమరావతి

అరాచకానికి, దౌర్జన్యానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు. తానో శాసనసభ్యుడినని మర్చిపోయి వీధిరౌడీలా, గూండాలా ప్రవర్తించారు. ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఆ దురాగతానికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మాచర్ల నియోజకవర్గాన్ని తన అరాచకాలతో నిత్యం రగులుతున్న రావణకాష్ఠంలా, బందిపోట్లకు నిలయమైన ఒకప్పటి చంబల్‌లోయలా మార్చేసిన పిన్నెల్లి.. అక్కడ ఎంత పేట్రేగిపోతున్నారో చెప్పేందుకు ఆ వీడియోనే నిదర్శనం. పిన్నెల్లి వంటి వ్యక్తి శాసనసభ్యుడైనందుకు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది! మాచర్లకు నాలుగోసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పిన్నెల్లి... తాలిబాన్ల లాంటి తన అనుచరగణంతో ప్రజల్ని 

భీతావహుల్ని చేస్తూ నియోజకవర్గాన్ని మరో అఫ్గానిస్థాన్‌లా మార్చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల్ని భయపెడుతూ, ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను బెదిరిస్తూ ఏకపక్షంగా ఓటింగ్‌ చేయించుకుని గెలుస్తున్న ఆయనకు ఈసారి తెదేపా నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు తెదేపాకు గట్టి పట్టున్న గ్రామం. పోలింగ్‌ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని వెంటేసుకుని బూత్‌లోకి దూసుకెళ్లారు. శాసనసభ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహిస్తున్న కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఈవీఎంను రెండు చేతులతో ఎత్తి, నేలకేసి బలంగా కొట్టారు. ఈవీఎంతోపాటు, వీవీప్యాట్‌ కూడా కింద పడి ధ్వంసమయ్యాయి. వాటిని తన్నుకుంటూ తెదేపా ఏజెంట్‌కు వేలు చూపించి బెదిరిస్తూ ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు.  

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని
పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

భీతావహులైన సిబ్బంది

ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్ధంగా అనుచరుల్ని వెంటేసుకుని పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళుతున్నా పోలీసులు, పోలింగ్‌ సిబ్బంది అడ్డుకోలేదు. ఆయన పోలింగ్‌ బూత్‌లోకి రాగానే సిబ్బంది లేచి నిలబడి నమస్కారం కూడా పెట్టారు. ఆయన నేరుగా పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టారు. తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లారు. ఆయన అనుచరుల్లో ఒకరితో కలబడి పిడిగుద్దులు గుద్దారు. ఎమ్మెల్యేపైకి కూడా విసురుగా వెళుతుంటే ఆయన అనుచరులు గట్టిగా పట్టుకుని ఆపేశారు. ఈ ఘటనతో పోలింగ్‌ సిబ్బందితోపాటు, ఓటర్లు భీతావహులయ్యారు. ఎమ్మెల్యే ఈవీఎంను విసిరికొడుతున్న సమయానికి... ఎదురుగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేస్తున్న వ్యక్తి భయంతో బయటకు పారిపోవడం, మహిళా పోలింగ్‌ సిబ్బంది భయంతో ఒక మూలకు వెళ్లిపోవడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వచ్చాక ఆయన అనుచరులు, వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. తెదేపా కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నంబూరి శేషగిరిరావుపై దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. శేషగిరిరావు సహా తెదేపాలో కీలకంగా వ్యవహరించిన కొందరు.. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అరాచకాలకు భయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో కాలం గడుపుతున్నారు. 

కిందపడిన వీవీప్యాట్‌ను పైకి తీసి మళ్లీ నేలకేసి కొడుతున్న పిన్నెల్లి

నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడినే గుర్తుపట్టలేనంత భయం! 

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరూ చూస్తుండగా.. ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ ఘటనపై పోలీసులు ఏమని కేసు నమోదు చేశారో తెలుసా? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారట! పోలింగ్‌ సిబ్బంది కూడా వారిని గుర్తుపట్టలేకపోయారట! ఎమ్మెల్యే పోలింగ్‌ స్టేషన్‌లోకి రాగానే సిబ్బంది గౌరవసూచకంగా లేచి నమస్కరించడం సీసీ కెమెరాలో చక్కగా రికార్డయింది. కానీ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పిన్నెల్లిని పోలింగ్‌ సిబ్బంది ఎవరూ గుర్తుపట్టలేదట. దీన్నిబట్టే వారెంత భయపడ్డారో అర్థమవుతోంది. సిబ్బంది గుర్తుపట్టకపోయినా సీసీ కెమెరాలున్నాయి కదా! ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేయడం, తెదేపా ఏజెంట్‌ను బెదిరించడం వంటివన్నీ పోలింగ్‌ సిబ్బందిలో ఒకరు సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం కూడా సీసీ కెమెరాలో రికార్డయింది. దాని ఆధారంగానైనా ఆయనపై కేసు పెట్టొచ్చు కదా! కానీ పెట్టలేదు. ఎందుకంటే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులంతా ఎమ్మెల్యే బంటులే! 

ధ్వంసమైన ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలు.. వీడియో తీస్తున్న అధికారి

అంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరే పోలీసులు 

పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో రెండు బూత్‌లు ఉన్నాయి. 1,464 మంది ఓటర్లు ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఇదీ ఒకటి. కానీ పోలింగ్‌ రోజున అక్కడున్నది కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు. ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం పగలగొట్టినా, తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వుతూ అరాచకం సృష్టించినా చోద్యం చూడటం తప్ప ఆ కానిస్టేబుళ్లు చేసిందీ, చేయగలిగిందీ ఏమీ లేదు. పల్నాడులో ఎన్నికల సంఘం పోలింగ్‌ ‘ఎంత చక్కగా’ నిర్వహించిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. పల్నాడు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, 34 కంపెనీల బలగాలు కావాలని జిల్లా అధికారులు కోరితే 19 కంపెనీల్ని మాత్రమే ఇచ్చి సర్దుకోమన్నారు. పోలింగ్‌ రోజున ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డూఆపూ లేకుండా పోవడానికి అదీ ఒక కారణం. 

పిన్నెల్లి చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు

అప్పటి డీజీపీ నుంచి క్షేత్రస్థాయి పోలీసుల వరకు అందరూ బాధ్యులే! 

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ ఎన్నికల్లో చేయని అరాచకం లేదు. పోలింగ్‌ రోజున, అనంతరం తీవ్రస్థాయిలో హింసాకాండకు పాల్పడ్డారు. కారంపూడిలో తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేసి, దొరికినవాళ్లను దొరికినట్టు కొట్టి, తీవ్ర భయోత్పాతం సృష్టించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరింతగా పేట్రేగిపోయారు. అప్పటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి మొదలు.. అప్పటి పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, చివరకు హోంగార్డుల వరకు ఆయనకు అడ్డగోలుగా కొమ్ముకాశారు. ఒక అరాచక శక్తిని పెంచి పోషించారు. రాజేంద్రనాథరెడ్డి, రవిశంకర్‌రెడ్డిలను ఈసీ బదిలీ చేసినా.. డీఎస్పీల నుంచి కానిస్టేబుళ్ల వరకూ అందరూ పిన్నెల్లి కోరి తెచ్చుకున్నవారే ఉండటంతో ఎన్నికల సమయంలో ఆయన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. కొత్తగా వచ్చిన ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశాల్ని ఆయన కింద పనిచేసే అధికారులెవరూ పాటించలేదు సరికదా, ఎస్పీ తీసుకుంటున్న నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు చేరవేసేవారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాకానికి చివరకు ఎస్పీ బిందుమాధవ్‌ కూడా బలయ్యారు. 

పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు వెళుతూ నంబూరి శేషగిరిరావును హెచ్చరిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

అరెస్ట్‌ భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ! 

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రభుత్వ విప్‌గా కేబినెట్‌ హోదా కలిగిన పదవిలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ ఎన్నికల్లో చేసిన అరాచకాలు బయటపడుతుండటంతో అరెస్ట్‌ తప్పదన్న భయంతో ఇటీవల పరారయ్యారు. పల్నాడులో హింసాకాండపై హైకోర్టు చీవాట్లు పెట్టడం, ఎస్పీ సహా ఏడుగురు పోలీసు అధికారులపై ఈసీ వేటు వేయడం, కలెక్టర్‌ను బదిలీ చేయడంతో ఇక తమ ఆటలు సాగవని పిన్నెల్లి సోదరులకు అర్థమైంది. అల్లర్లపై దర్యాప్తునకు సిట్‌ను నియమించడంతో పిన్నెల్లి సోదరులు పొరుగు రాష్ట్రానికి పారిపోయి తలదాచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే తన గన్‌మెన్‌లను వదిలేసి పారిపోయారు. 

కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నంబూరి 

వీడియో బయటకు రాకపోతే అందరూ శుద్ధపూసలే

మాచర్లలో ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, అనుచరులు అన్ని అరాచకాలు చేసినా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అక్కడికి వెళ్లలేదు. ఏం జరిగిందో తెలుసుకోలేదు. పాల్వాయి గేట్‌ పోలింగ్‌ బూత్‌లో ఎమ్మెల్యే చేసిన విధ్వంసం, ఈవీఎంను పగలగొట్టడం వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సంఘం అధికారులు నేరుగా చూడొచ్చు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు కూడా ఉన్నాయి. పోలింగ్‌ సిబ్బంది సెల్‌ఫోన్‌లోనూ రికార్డు చేశారు.  కానీ మంగళవారం వీడియో వెలుగులోకి వచ్చే వరకు ఈసీకి ఆ విషయం తెలియలేదంటే, కేసు నమోదు చేయలేదంటే.. ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం, పాత, కొత్త ఎస్పీలు సహా అక్కడి పోలీసులు ఎంత చక్కగా పనిచేస్తున్నారో అర్థమవుతోంది. వీడియో వెలుగులోకి వచ్చాక ఎన్నికల సంఘం హడావుడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం, కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేయడం కొసమెరుపు! ఆ వీడియో బయటకు రాకపోతే.. ఎన్నికల సంఘం, పోలీసులు, పోలింగ్‌ సిబ్బంది అందరూ శుద్ధపూసలే! ఇంతకాలం పోలీసులు పల్నాడులో ఎంత ఏకపక్షంగా పనిచేశారో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ! పిన్నెల్లి సోదరులు పొరుగు రాష్ట్రానికి పరారయ్యేందుకు పోలీసులే సహకరించారని చెప్పడానికి సందేహమే అక్కర్లేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి అక్కడ బాహాటంగా తిరుగుతూ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలూ ఇస్తున్నారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వెంటనే ఆయనను అరెస్ట్‌ చేయాలి.

పోలింగ్‌ అనంతరం అదేరోజు వైకాపా శ్రేణులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ నంబూరి

ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలి

పోలింగ్‌ బూత్‌లోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌డీ విల్సన్‌ డిమాండు చేశారు. ఇంత అరాచకం చేశారని తెలిసినా పోలీసు యంత్రాంగం నిందితుణ్ని అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అల్లర్లపై వేసిన సిట్‌ ఒక డొల్ల అని విమర్శించారు.  


కఠిన చర్యలకు డీజీపీని ఆదేశించండి: ఈసీ

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముకేశ్‌ కుమార్‌ మీనాను ఆదేశించింది.


నేను అమాయకుడినే..

ఎక్కడా గొడవలు చేయలేదన్న ఎమ్మెల్యే పిన్నెల్లి
రాత్రికి వీడియో ద్వారా బట్టబయలైన నిజస్వరూపం

ఈనాడు, అమరావతి: ‘నేనెక్కడా గొడవలు చేయలేదు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు’... పల్నాడు జిల్లా పాల్వాయి గేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈ నెల 13న ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం ఒక మీడియా ఛానెల్‌తో చెప్పిన మాటలివి. ‘నేనెక్కడికీ పారిపోలేదు. పారిపోవాల్సిన అవసరం లేదు. నాపై ఏమైనా కేసులున్నాయా? నేనేమైనా గొడవలు చేయించానా? గొడవలు చేయించింది మీరే. మాచర్ల రావాలంటే రెండు గంటలు..’ అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని తీవ్ర పదజాలంతో పిన్నెల్లి దూషించారు. బిందుమాధవ్‌ పల్నాడు జిల్లా ఎస్పీగా నియమితులైన నాటి నుంచే తమకు అనుమానంగా ఉందని ఆరోపణలు చేశారు. కానీ ఈవీఎం పగలగొడుతూ ఆయనే అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఎంత అమాయకుడో.. కొద్ది గంటల్లోనే అందరికీ తెలిసిపోయింది. సాయంత్రం 4 గంటలకు ఆయన మీడియా ఛానెల్‌తో పైన చెప్పిన విషయాలు మాట్లాడగా.. రాత్రి 9 గంటలకు ఈవీఎం ధ్వంసం వీడియో బయటకొచ్చింది. గొడవలు చేయలేదని ఆయన చెప్పిన మాటలు.. శుద్ధ అబద్ధమని తెలిసిపోయింది.


మా పిన్నెల్లి మంచివాడంటూ కితాబిచ్చారే..!

జగన్‌.. ఇప్పుడేమంటారో?

‘మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాకు మంచి స్నేహితుడు. మంచివాడు. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా.. రామకృష్ణారెడ్డిని అఖండమైన మెజారిటితో గెలిపించండి. ఇంకా పై స్థానంలోకి తీసుకెళతాను’ అని ఈ నెల 6న మాచర్లలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ‘ఎంతో మంచివాడంటే.. పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించి అక్కడి వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి, ఈవీఎంలు ధ్వంసం చేసేవారా?’ అని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. ‘రామకృష్ణారెడ్డి మీకు మరింత స్నేహితుడు అంటున్నారు. అలాంటి వ్యక్తులే మీ స్నేహితులా? ఈవీఎం పగలగొట్టిన ఆయనపై చర్యలు తీసుకుంటారా? లేదా మరింత పైస్థానం కల్పిస్తానంటూ వెనకేసుకొస్తారా’’ అని ప్రశ్నిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు