Julakanti Brahma Reddy: జవహర్‌రెడ్డి కనుసన్నల్లో జరిగే సిట్‌ దర్యాప్తుపై నమ్మకం లేదు

పోలీసుల కనుసన్నల్లోనే పల్నాడులో హింస జరిగిందని.. తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసి, ఆస్తుల్ని ధ్వంసం చేశారని నరసరావుపేట ఎంపీ, లోక్‌సభ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ధ్వజమెత్తారు.

Updated : 22 May 2024 07:43 IST

వాస్తవాలు బయటకు రావాలంటే.. సిటింగ్‌ జడ్జితో విచారణ చేయించాలి 
పల్నాడులో హింసాకాండకు కారణం వైకాపా అనుకూల పోలీసులే  
పాల్వాయి, కారంపూడి, కండ్లకుంటలో దాడులకు ఎమ్మెల్యే పిన్నెల్లి కారణం  
తెదేపా నేతలు శ్రీకృష్ణదేవరాయలు, బ్రహ్మారెడ్డి ధ్వజం

మాచర్ల నుంచి పారిపోయి టీవీ ఛానల్‌తో మాట్లాడుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు
అరెస్టు చేయలేదని వీడియో క్లిప్‌ చూపి ప్రశ్నిస్తున్న జూలకంటి బ్రహ్మారెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- పట్టాభిపురం (గుంటూరు): పోలీసుల కనుసన్నల్లోనే పల్నాడులో హింస జరిగిందని.. తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసి, ఆస్తుల్ని ధ్వంసం చేశారని నరసరావుపేట ఎంపీ, లోక్‌సభ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కాకుండా.. వైకాపాకు చీఫ్‌ సెక్రటరీలా వ్యవహరిస్తున్న కేఎస్‌ జవహర్‌రెడ్డి కనుసన్నల్లో జరిగే సిట్‌ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. వాస్తవాలు బయటకు రావాలంటే సిటింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండు చేశారు. ఎన్నికల తర్వాత తెదేపా వారిపై దాడి చేస్తామని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పదేపదే చేసిన హెచ్చరికలపై ఎన్నికల సంఘం, జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ముందే ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినా.. ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎస్‌ నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు వైకాపాకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ కూడా సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి, మౌనంగా ఉండిపోయింది. అక్కడ ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇది ముమ్మాటికీ వారి వైఫల్యమే’ అని విరుచుకుపడ్డారు.

మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడులో జరిగిన హింసాత్మక ఘటనలపై  శ్రీకృష్ణదేవరాయలు, బ్రహ్మారెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘పోలింగ్‌ రోజు, తర్వాత మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డే ప్రధాన కారణం. దాడుల్ని కట్టడి చేయటంలో పోలీసు శాఖ, ఎన్నికల కమిషన్‌ విఫలమయ్యాయి. ఎన్నికల తర్వాత దాడులు జరుగుతాయని మేం ముందే అప్రమత్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాడుల తర్వాత.. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గృహ నిర్బంధం నుంచి తప్పించుకుని హైదరాబాద్‌ వెళ్లి అక్కడ వైకాపాకు చెందిన మీడియా సంస్థలతో మాట్లాడారు. అయినా పోలీసులు ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని పేర్కొన్నారు. ‘ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారో ఎమ్మెల్యే పిన్నెల్లి చెప్పాలి. ఆయన ఇంట్లో రాళ్లు, ఆయుధాలు ఎందుకు ఉన్నాయి?’ అని ప్రశ్నించారు. అధికారులు ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి రాళ్లు తరలిస్తున్న ఫొటోలను మీడియా ముందు ప్రదర్శించారు.

వాహనాలతో తొక్కిస్తే.. హత్యాయత్నం కాదా?

‘ఇద్దరు కానిస్టేబుళ్లను పెట్టి నన్ను గృహనిర్బంధం చేశారు. చట్టాన్ని గౌరవించి నేను ఇంట్లోనే ఉన్నా.. పాల్వాయి, కారంపూడి, కండ్లకుంటలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితోపాటు ఆయన అనుచరులు వెళ్లి దాడులు చేసింది నిజం కాదా?’ అని బ్రహ్మారెడ్డి నిలదీశారు. ‘పిన్నెల్లి అనుచరులు మాచర్లలో తెదేపా వాళ్లను వాహనాలతో తొక్కిస్తే హత్యాయత్నం కేసులు కాకుండా 324 సెక్షన్‌ పెట్టి కేసు నమోదు చేశారు. మైనార్టీలపైనా వారు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడ్డారు. వైకాపా దాడుల్లో 74 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు గాయపడ్డారు’ అని చెప్పారు.

ఐజీ, ఎస్పీ ఉన్నప్పుడే.. కారం చల్లి దాడి 

ఐజీ శ్రీకాంత్, ఎస్పీ సుప్రజ అక్కడ ఉన్నప్పుడే.. రెంటాలలో తనపై కారం చల్లి దాడి చేశారని బ్రహ్మారెడ్డి చెప్పారు. ‘కారంపూడిలో ఒక సామాజికవర్గానికి చెందిన అధికారిపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాడి చేశారు. అయినా ఆయన ఎమ్మెల్యే సరిహద్దు దాటే వరకు భద్రత కల్పించారు. పిన్నెల్లి మాత్రం పోలీసులు తెదేపాకు అనుకూలమని ప్రచారం చేస్తున్నారు. పోలీసు అధికారుల నియామకాలన్నీ.. ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారమే చేశారు. కానీ పోలీసు అధికారులకు కులం అంటగట్టి మాట్లాడుతున్నారు. ఆ జాబితా పంపింది వైకాపా ప్రభుత్వంలోని చీఫ్‌ సెక్రటరీ కాదా? ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు రావటం అధికార దుర్వినియోగం కాదా? మాచర్ల మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ తురకా కిశోర్‌ పుట్టినరోజు వేడుకలకు కొందరు పోలీసు అధికారులు హాజరయ్యారు. ఇవన్నీ చూస్తే మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు.. అధికార పార్టీ నేతలతో ఎంతగా అంటకాగారో అర్థమవుతుంది’ అని బ్రహ్మారెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరు రేంజి ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఎన్నికల సంఘం నియమిస్తే.. దానికీ తెదేపా కారణమంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు.


అదనపు బలగాలు కోరినా ఇవ్వలేదు

- శ్రీకృష్ణదేవరాయలు

150 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో గొడవలు జరుగుతాయని ముందే చెప్పామని, అదనపు బలగాలను మోహరించాలని తాము కోరినా పట్టించుకోలేదని లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. పోలింగ్‌ రోజు, తర్వాత మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాకాండకు పోలీసులే కారణమని మండిపడ్డారు. దాడులు జరుగుతున్నాయని చెప్పినా వారు స్పందించలేదని, సిట్‌ అధికారులు దీనిపై విచారణ చేయాలని ఆయన డిమాండు చేశారు. ‘ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి తెదేపాకు ఓటేస్తున్నారని తెలిసే.. పోలింగ్‌ శాతం ఎలాగైనా తగ్గించాలని వైకాపా నేతలు ప్రయత్నించారు. పోలింగ్‌ రోజు ఉద్దేశపూర్వకంగా తెదేపా ప్రభావిత గ్రామాల్లో అధిక సంఖ్యలో పోలీసుల్ని పెట్టి.. కార్యకర్తలను ఓటేయడానికి రాకుండా అడ్డుకున్నారు. అక్కడ బూత్‌కు ఒక్క కానిస్టేబుల్‌ను మాత్రమే పెట్టడంతో.. ఆయన దౌర్జన్యాలను నిలువరించలేకపోయారు. వైకాపా ప్రభావిత గ్రామాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్ని ఇష్టారాజ్యంగా వదిలేశారు. దాడులు జరుగుతున్నాయని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. వారు ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారో వివరాలు తీయాలి. పోలింగ్‌ ముందు, తర్వాత మా కదలికలపైనా విచారణకు మేం సిద్ధమే. అవసరమైతే ఫోను కూడా ఇస్తాం’ అని పేర్కొన్నారు. ఇంత దౌర్జన్యాలకు దిగినా 85% పైగా పోలింగ్‌ జరగడాన్ని వైకాపా నేతలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు’ అని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని