Mohan Yadav: ‘రాహుల్‌ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Updated : 18 Apr 2024 01:28 IST

జబల్‌పుర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పై మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) సీఎం మోహన్‌ యాదవ్‌ (Mohan Yadav) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్‌ గాంధీ పోటీ చేసేందుకు దేశంలో సురక్షితమైన సీటు అనేది లేదని, భవిష్యత్తు ఎన్నికల్లో మహాసముద్రాల ఆవల ఏదైనా ప్రాంతం నుంచి ఆయన పోటీ చేయాల్సి రావొచ్చన్నారు. గత ఎన్నికల్లో అమేథీ (Amethi) నుంచి పోటీ చేసిన రాహుల్‌.. దాన్ని రక్షించుకోలేకపోయారన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తొలి దశ ప్రచారం ముగియడంతో మీడియాతో మోహన్‌ యాదవ్‌ మాట్లాడారు.

‘‘మన మతాన్ని, యువ, మహిళల శక్తిని రాహుల్‌ గాంధీ అవమానించేవారు. ఉత్తరప్రదేశ్‌ (UP)లో ఓడిపోవడంతో అక్కడి నుంచి పారిపోయి దక్షిణ భారత్‌కు చేరుకున్నారు. భవిష్యత్తులో ఆయన మహాసముద్రాలను దాటి ఏదైనా ప్రాంతం నుంచి పోటీ చేయాల్సి రావచ్చు’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. దేశంలో ఉన్న నక్సలిజం, ఉగ్రవాదం, అవినీతి, పేదరికాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠలో పాల్గొనడమే కాకుండా అబుదాబిలో దేవాలయాన్ని ప్రారంభించడంతో సనాతన ధర్మం అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ దక్కించుకున్న ఏకైక లోక్‌సభ స్థానం ఛింద్వారాలోనూ ఈసారి భాజపా జెండా ఎగరబోతోందని మోహన్‌ యాదవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని