Maheshwar Reddy: పౌరసరఫరాల శాఖలో అవినీతిపై కేంద్రానికి లేఖ రాస్తా

పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిటింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని భాజపా శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పౌర సరఫరాల శాఖ అవినీతిపై కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.

Published : 28 May 2024 03:03 IST

సిటింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలి
పార్టీలో సమన్వయంతోనే నాకు భాజపా పక్షనేత పదవి: మహేశ్వర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిటింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని భాజపా శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పౌర సరఫరాల శాఖ అవినీతిపై కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ వెంకటేశ్‌ నేతతో కలిసి ఆయన మాట్లాడారు. తాను 19 ప్రశ్నలు లేవనెత్తితే ఒక్క ప్రశ్నకు మాత్రమే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పారన్నారు. మంత్రి తనపై వ్యక్తిగతంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. భాజపా శాసనసభాపక్ష పదవిని పైరవీ చేసి తాను తెచ్చుకోలేదని, పార్టీలో సమన్వయంతోనే తనకు అవకాశం కల్పించారని అన్నారు. బకాయిలు ఉన్న రైస్‌ మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘‘కుంభకోణాలు కళ్లముందు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువు మే 15తో ముగిసింది.. అయినా కాంట్రాక్టర్లకు మరో నాలుగు నెలల అదనపు సమయం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? 90 రోజుల్లో ధాన్యం తరలించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటారా? లేదా? రైస్‌ మిల్లర్ల నుంచి వంద రూపాయల స్టాంప్‌పేపర్‌ మీద సంతకాలు పెట్టించుకున్నది వాస్తవం కాదా’’ అని ప్రశ్నించారు. గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని ఉత్తమ్‌ ఎలా తెచ్చుకున్నారో తాను కూడా చెప్పగలనని అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి అనుమతితోనే సీఎంను కలిశానని దీనిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తే సీఎంనూ అవమానించినట్లేనని అన్నారు.

అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలి: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారానికి ఒకసారి దిల్లీకి వెళ్లి కప్పం కడుతున్నారు’ అని భాజపా ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. సీఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానాన్ని ఎన్నికల కమిషన్‌ తనిఖీ చేయాలన్నారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆస్తులు తగ్గి మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయన్నారు. వివిధ మంత్రిత్వశాఖలపై వస్తున్న ఆరోపణలపై సీఎం స్పందించాలని, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు