Congress: కాంగ్రెస్‌ ‘ఘర్‌ ఘర్‌ గ్యారెంటీ’ ప్రచారం మొదలు..!

కాంగ్రెస్‌ తన ప్రధాన హామీలపై ప్రచారం మొదలుపెట్టింది. ఘర్‌ ఘర్‌ గ్యారెంటీ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రారంభించారు. 

Published : 03 Apr 2024 17:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ (Congress) బుధవారం నుంచి ఘర్‌ ఘర్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రజలకు పార్టీ ప్రకటించిన ‘పాంచ్‌ న్యాయ్‌, పచ్చీస్‌ గ్యారెంటీ’ (ఐదు న్యాయాలు, 25 హామీలు) దేశంలోని ప్రతీ ఇంటికీ తెలియజేయడమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఈశాన్య దిల్లీలోని ఉస్మాన్‌పుర్‌, కైత్వాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మా హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ గ్యారెంటీ కార్డులను మేం పంచుతున్నాం. ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త, నాయకుడు ఈ కార్డులను అన్ని వర్గాలకు చేర్చాలి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఏం చేస్తుందో వెల్లడించాలి’’ అని సూచించారు. 

ఈసందర్భంగా ప్రధాని మోదీపై ఖర్గే విమర్శల వర్షం కురిపించారు. హామీలను నిలబెట్టుకోవడంలో భాజపా విఫలమైందన్నారు. ‘‘మేము ఏదైనా హామీ ఇస్తే మా ప్రభుత్వం దానిపై ఎప్పుడూ పనిచేస్తుంది. ప్రధాని మోదీ గ్యారెంటీ గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఆయన హామీ ఎన్నడూ ప్రజలకు చేరదు. గతంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాల గురించి ఆయన మాట్లాడారు. కానీ, ప్రజలకు అది అందలేదు. ఐటీ శాఖ దాడులతో ప్రధాన ప్రతిపక్షాన్ని బెదిరించాలని చూస్తున్నారు. ఆ విభాగం మా పార్టీకి చెందిన రూ.135 కోట్లను స్వాధీనం చేసుకొంది. ప్రజాస్వామ్యంలో ఇలానేనా ఎన్నికలు నిర్వహించేది..? ప్రజలు దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనుకొంటున్నారు’’ అని పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌ పార్టీ తన ప్రచారంలో ప్రధానంగా పాంచ్‌ న్యాయ్‌, పచ్చీస్‌ గ్యారెంటీ’పైనే ఆధారపడింది. దీనిలో యువన్యాయ్‌, నారీ న్యాయ్‌, కిసాన్‌ న్యాయ్‌, శ్రామిక్‌ న్యాయ్‌, హిస్సేదారి న్యాయ్‌కు హామీ ఇచ్చింది. ఇవి కాకుండా మరో 25 గ్యారెంటీలను కూడా ప్రకటించింది. ఇక ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్‌ 5వ తేదీన జైపుర్‌లో అగ్రనాయకులతో ఏర్పాటుచేయనున్న సభలో విడుదల చేయనుంది. ఆ మర్నాడే హైదరాబాద్‌లో కూడా భారీ సభ ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే ఆ పార్టీ ‘హాత్‌ బదలేగా హాలత్‌’ పేరిట నినాదాన్ని విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని