West Bengal: బెంగాల్‌ మమతదే

అంచనాలను తలకిందులు చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ సంచలనం సృష్టించారు. మొత్తం 42 స్థానాలకుగానూ 29 గెలుచుకుని భాజపాకు నిరాశను మిగిల్చారు.

Published : 05 Jun 2024 05:35 IST

మరోసారి మ్యాజిక్‌
29 చోట్ల విజయం
భాజపాకు నిరాశ

కోల్‌కతా: అంచనాలను తలకిందులు చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ సంచలనం సృష్టించారు. మొత్తం 42 స్థానాలకుగానూ 29 గెలుచుకుని భాజపాకు నిరాశను మిగిల్చారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించినా సత్ఫలితాలను సాధించలేకపోయారు. 35 సీట్లను గెలుస్తామని లక్ష్యంగా పెట్టుకున్నా రెండంకెల సంఖ్యకే భాజపా పరిమితమైంది. అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలతో సతమతమైన తృణమూల్‌ ఒంటరిగా పోటీ చేసినా సత్తా చాటింది. పౌరసత్వ సవరణ చట్టంపై ఆధారపడిన భాజపాకు అది కలిసిరాలేదు. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి భాజపాకు నష్టం కలిగించింది. 

  • ఈ ఎన్నికల్లో భాజపా 12 సీట్లకే పరిమితమైంది. గతంలో గెలిచిన 18 కంటే 6 స్థానాలను తక్కువగా గెలిచింది. 3శాతం ఓటింగ్‌ తగ్గి 37శాతానికి పరిమితమైంది. 
  • 2019 ఎన్నికలతో పోలిస్తే నాలుగు శాతం ఓటింగ్‌ పెంచుకున్న తృణమూల్‌ ఈసారి 47శాతం ఓట్లను సాధించింది. గత ఎన్నికల్లో 22 సీట్లను గెలిచిన తృణమూల్‌ ఈసారి 29 సీట్లు గెలుచుకుంది. 
  • గత ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని లెఫ్ట్‌ది ఈసారీ అదే పరిస్థితి.
  • గత ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ ఈసారి ఒక సీటుకే పరిమితమైంది. 

అధీర్‌ రంజన్‌ ఓటమి

కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురీ బహరాంపుర్‌లో ఓటమి పాలయ్యారు. తృణమూల్‌ అభ్యర్థి యూసుఫ్‌ పఠాన్‌ ఆయనను ఓడించారు. 1999 నుంచి అధీర్‌ రంజన్‌ ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు. 


భారీ మెజారిటీలు వీరికే..

  • తృణమూల్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ 7,10,930 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
  • జయ్‌నగర్‌ తృణమూల్‌ అభ్యర్థి ప్రతిమా మండల్‌ 4,70,219 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • బోల్‌పుర్‌లో తృణమూల్‌ అభ్యర్థి అసిత్‌ కుమార్‌ మల్‌ 3,27,253 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని