Manikya Rao: పిన్నెల్లి సోదరుల నుంచి నా ప్రాణాలకు ముప్పు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెదేపా కార్యకర్త, పోలింగ్‌ రోజు కండ్లకుంటలో ఏజెంటుగా వ్యవహరించిన నోముల మాణిక్యరావు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 27 May 2024 04:40 IST

తెదేపా ఏజెంటుగా కూర్చున్నానని నా భార్య, బిడ్డల్ని చంపాలని చూశారు
కాపాడాలని డీజీపీని వేడుకున్న మాణిక్యరావు
కేసు నమోదు చేయాలని గుంటూరు ఎస్పీకి ఆదేశం 

డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు వినతిపత్రం ఇస్తున్న మాణిక్యరావు, వర్ల రామయ్య, గూడపాటి లక్ష్మీనారాయణ, మన్నవ సుబ్బారావు, అఖిల్‌ తదితరులు

ఈనాడు డిజిటల్, అమరావతి, న్యూస్‌టుడే, మంగళగిరి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెదేపా కార్యకర్త, పోలింగ్‌ రోజు కండ్లకుంటలో ఏజెంటుగా వ్యవహరించిన నోముల మాణిక్యరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపడానికి కండ్లకుంటకు చెందిన బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి, పిన్నెల్లి వెంకట లక్ష్మారెడ్డి, మోదుగుల వెంకటరెడ్డిని వారు నియమించారని వాపోయారు. ప్రస్తుత పరిస్థితిలో తాను మాచర్ల వెళ్లే పరిస్థితి లేదని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ మేరకు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, గూడపాటి లక్ష్మీనారాయణ, కోడూరి అఖిల్, వల్లూరి కిరణ్‌ తదితరులతో కలిసి వినతిపత్రం అందజేశారు. మంగళగిరి గ్రామీణ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి వెనకాడుతున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లగా.. గుంటూరు ఎస్పీకి చెబుతానని మళ్లీ ఫిర్యాదు చేయాల్సిందిగా డీజీపీ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఎస్పీ నుంచి సీఐ వరకు దీని గురించి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా వారు స్పందించలేదని.. చివరికి మీ దగ్గరకు రావాల్సి వచ్చిందని డీజీపీ ఎదుట తెదేపా నేతలు వాపోయారు. వెల్దుర్తి మండలం కండ్లకుంటలో పోలింగ్‌ రోజున పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సృష్టించిన అరాచకం, మాణిక్యరావు భార్య, కుమారులపై దాడి చేయడం, దాన్ని వీడియో తీసి అతడ్ని బెదిరించడం, నిందితులపై చర్యలు తీసుకోకుండా మిన్నకున్న పోలీసుల తీరును వారు డీజీపీకి వివరించారు. సానుకూలంగా స్పందించిన డీజీపీ బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. 

ఏజెంటుగా కూర్చోకూడదా?

‘మాదిగ సామాజికవర్గానికి చెందిన నేను పోలింగ్‌ ఏజెంటుగా కూర్చోవడం పాపమా? ఎస్సీలు రాష్ట్రంలో ఉండకూడదా? వారిపై కిరాతకంగా దాడులు చేస్తుంటే పట్టించుకోరా?’ అని మాణిక్యరావు ప్రశ్నించారు. ‘‘పోలింగ్‌ కేంద్రంలోనే నన్ను కొట్టారు. తెదేపా ఏజెంటుగా కూర్చునే ధైర్యం నీకెక్కడిదిరా అంటూ నా కులాన్ని ప్రస్తావిస్తూ దూషించారు. వెంకట్రామిరెడ్డి సుమారు 300 మంది అనుచరులతో కలిసి నా ఇంటి మీదకు వెళ్లారు. నా పెద్ద కుమారుడిని కింద పడేసి పొత్తికడుపు మీద తన్నారు. నా చిన్నకుమారుడు, భార్యను కర్రలతో కొట్టారు. కాళ్లు పట్టుకుని బతిమాలినా వదల్లేదు. ఆ దృశ్యాల్ని మొబైల్‌లో రికార్డు చేసి... బూత్‌ లోంచి బయటకు వస్తావా లేదా.. అంటూ నన్ను బెదిరించి మానసిక వేదనకు గురిచేశారు’’ అని మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ మాణిక్యరావు తెలిపారు. 

పిన్నెల్లి కంటే కిమ్‌ మేలు: వర్ల రామయ్య

రామకృష్ణారెడ్డి కంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ మేలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దళితుడైన మాణిక్యరావు, ఆయన కుటుంబంపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూశారు. నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ అంటూనే జగన్‌రెడ్డి, ఆయన అనుచరులు వారిపై దాడులకు తెగబడుతున్నారు’’ అని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని