Home voting: ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్‌ సింగ్‌, ఆడ్వాణీ

రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. 

Updated : 18 May 2024 18:40 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటు (Home voting)ను ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ, కేంద్ర మాజీమంత్రి మురళీ మనోహర్‌ జోషి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ రాజకీయ కురువృద్ధులు ఇంటినుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారని దిల్లీ ఎన్నికల సంఘం వెల్లడించింది.

దిల్లీలో గురువారం నుంచి ఈ వెసులుబాటు అందుబాటులోకి రాగా.. మే 24 వరకు దానిని ఉపయోగించుకోవచ్చు. దీనికింద శుక్రవారం దేశ రాజధానిలోని ఏడు నియోజకవర్గాల నుంచి 1409 మంది ఓటేశారు. వెస్ట్ దిల్లీ నుంచి అధికంగా 348 మంది ఓటు వేశారు. రెండు రోజుల వ్యవధిలో 2,956 మంది ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని ఎన్నికల సంఘం సీఈఓ వెల్లడించారు. ‘‘మన్మోహన్‌ సింగ్, మురళీ మనోహర్‌ జోషి దిల్లీ నియోజకవర్గం నుంచి మే 17న పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు’’ అని తెలిపారు.

ఈ ప్రక్రియలో భాగంగా 85ఏళ్లు పైబడినవారు, 40శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటినుంచే ఓటు వేయవచ్చు. పోలింగ్‌ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్టుమెంట్‌, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ను తెస్తారు. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లు దేశంలో 88.4 లక్షల మంది ఉన్నారని ఈసీ గణాంకాలు వెల్లడించింది. 85 ఏళ్ల వయసు పైబడినవారు 82 లక్షల మంది ఉన్నారని పేర్కొంది. వందేళ్లకుపైబడిన వారు 2.18 లక్షల మంది ఉన్నారని స్పష్టంచేసింది. వీరంతా కలిసి మొత్తం 1.73 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ ఇంటినుంచి ఓటు అవకాశం కల్పించనున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని