MLC Bypoll: గత ఎన్నికల కంటే పెరిగిన చెల్లని ఓట్లు

ఓటర్లంతా పట్టభద్రులయినా, కొన్నాళ్ల నుంచి అధికారులు, పార్టీల నాయకులు ఓటింగ్‌ విధానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో చెల్లని ఓట్లు 2021 ఎన్నికల కంటే పెరిగాయి.

Published : 09 Jun 2024 04:59 IST

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తొలిసారి కాంగ్రెస్‌ విజయం
విజయబావుటా ఎగరేసిన తీన్మార్‌ మల్లన్న 
ద్వితీయ ప్రాధాన్య ఓట్లపై ఆశలు పెట్టుకున్న రాకేశ్‌రెడ్డికి నిరాశ
చాలా మంది ఓటర్లు తొలి ప్రాధాన్య ఓటుకే పరిమితం  

ఈనాడు, నల్గొండ: ఓటర్లంతా పట్టభద్రులయినా, కొన్నాళ్ల నుంచి అధికారులు, పార్టీల నాయకులు ఓటింగ్‌ విధానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో చెల్లని ఓట్లు 2021 ఎన్నికల కంటే పెరిగాయి. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో 21,636 ఓట్లు చెల్లనివిగా నమోదు కాగా.. తాజా ఎన్నికల్లో ఈ సంఖ్య 27,990కి పెరిగింది. అంటే పోలైన ఓట్లలో సుమారు ఎనిమిది శాతం. మరో వైపు భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ అనంతరం తీన్మార్‌ మల్లన్నకు 1,50,524 ఓట్లు, భారాస మద్దతిచ్చిన ఏనుగుల రాకేశ్‌రెడ్డికి 1,35,802 ఓట్లు వచ్చాయి. అప్పటికీ గెలుపు కోటా అయినా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. అయితే సాంకేతికంగా పోటీలో ఇద్దరే మిగలడం, అప్పటికే తీన్మార్‌ మల్లన్న, రాకేశ్‌రెడ్డి కంటే 14,722 ఓట్ల ఆధిక్యంతో ఉండటంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశానుసారం మల్లన్నను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన మల్లన్న గెలిచినట్లు ప్రకటించారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మాత్రం తుది దశలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్న పోటీలో మిగలగా... ఇద్దరు అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని విజేతగా ప్రకటించడంతో పాటు ఎలిమినేషన్‌ ప్రక్రియలో మల్లన్న ఓట్లను సైతం లెక్కించి అందులోని రెండో ప్రాధాన్య ఓట్లను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కలిపారు. దీంతో ఆయన అప్పట్లో గెలుపు కోటా సాధించారు. గతంలో కంటే అత్యధికంగా ఈ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు ఓటర్లు కేవలం తొలి ప్రాధాన్య ఓటు మాత్రమే వేశారు. ఉదాహరణకు భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచిన పాలకూరి అశోక్‌గౌడ్‌కు సంబంధించి చెరో 10 వేల ఓట్లకు పైగా బ్యాలెట్‌ పత్రాల్లో కేవలం ఒకటి (1) అంకే వేశారు. దీంతో భారాస అభ్యర్థి గెలుపు అవకాశాలు ఇక్కడే దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఉంది. తొలి ప్రాధాన్య ఓట్లలో మల్లన్నకు మెజారిటీ వచ్చినా... భాజపా, స్వతంత్ర అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రాల్లోని రెండో ప్రాధాన్య ఓట్లతో గట్టెక్కుతామన్న భారాస నేతల ఆశలకు గండిపడింది. 

తొలిసారి కాంగ్రెస్‌ పాగా...

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో భారాస బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించగా తొలిసారి కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. దీంతో భారాస సిటింగ్‌ సీటును కోల్పోయినట్లైంది. భారాస కంచుకోటలో తొలిసారి కాంగ్రెస్‌ మద్దతిచ్చిన చింతపండు నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న) విజయం సాధించడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆయన్ను అభినందించారు. 


ప్రభావం చూపిన అశోక్‌గౌడ్‌ 

ప్రధాన పార్టీలతో సమానంగా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌గౌడ్‌ ఓటర్లపై ప్రభావం చూపారు. మొదటి ప్రాధాన్యంతో పాటు ఎలిమినేషన్‌ రౌండ్లు కలుపుకొని ఆయన 30,461 ఓట్లు సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ‘అశోక్‌ సార్‌’గా ప్రసిద్ధుడైన ఆయన గతంలో పలు పత్రికల్లో జర్నలిస్టుగా పని చేశారు. అనంతరం ఆన్‌లైన్‌లో పోటీ పరీక్షల క్లాసులు నిర్వహించారు. ఆ క్రమంలోనే రూ.1, రూ.100లకు క్లాసులను సబ్‌స్క్రైబ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పెద్ద ఎత్తున యువత, నిరుద్యోగులు ఆయన యూట్యూబ్‌ ఛానెల్‌ను అనుసరించారు. ఓట్ల పరంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, భారాస, భాజపా అభ్యర్థుల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని