Kishan reddy: భారాసతో నీతులు చెప్పించుకునే స్థితిలో భాజపా లేదు: కిషన్‌రెడ్డి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. భారాసతో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో భాజపా లేదన్నారు.

Updated : 26 May 2023 14:56 IST

హైదరాబాద్‌: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. భారాస ప్రతినిధులు రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవటం బాధ్యతారాహిత్యమే అవుతుందని దుయ్యబట్టారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భారాసతో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో భాజపా లేదని ఆయన వ్యాఖ్యానించారు.

రేపటి నీతిఅయోగ్ సమావేశానికి కూడా భారాస దూరంగా ఉండటం దుర్మార్గపు చర్య అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ నష్టపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలకు సీఎం రాకపోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌కు మహారాష్ట్ర వెళ్లేందుకు తీరిక ఉంది కానీ.. అంబేడ్కర్‌, జగ్జీవన్ రామ్ జయంతికి పూలమాల వేయటానికి తీరికలేదని విమర్శించారు. కేంద్రంతో ఘర్షణాత్మకమైన వైఖరితో రాష్ట్రం నష్టపోతోందని.. అవకాశం ఉన్న చోట తెలంగాణ గొంతు వినిపించటంలో కేసీఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వాల మధ్యలో ఘర్షణాత్మకమైన వైఖరి తెలంగాణకు నష్టం చేకూరుస్తోందన్నారు. జూన్ 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే జాబ్ మేళాకు భారీగా హాజరుకావాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి నిరుద్యోగులకు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని