KTR: రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్‌ లీకేజీ వ్యవహరంలోకి రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి లాగుతున్నారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈమేరకు వీరద్దరికి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు జారీ చేశారు.

Updated : 23 Mar 2023 22:51 IST

హైదరాబాద్‌:  టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌కి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు లీగల్ నోటీసులు పంపించారు. మొత్తం నియామకాల ప్రక్రియనే నిలిపివేసేలా కాంగ్రెస్, భాజపా కుట్ర పన్నుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, భాజపా ఉచ్చులో యువత చిక్కుకోకుండా..పరీక్షలకు సిద్ధం కావాలని కేటీఆర్ కోరారు. టీఎస్‌పీఎస్‌సీ దిద్దుబాటు చర్యలు చేపట్టిందని, భవిష్యత్తులో పొరపాట్లకు తావులేకుండా పరీక్షలు జరిపేందుకు  సిద్ధమవుతోందని చెప్పారు.

కేవలం రాజకీయ దురుద్దేశంతో తన పేరును ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా కుట్ర చేస్తున్నందుకు వీరిద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుందన్న అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవాలను పక్కనపెట్టి ఈ వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వాల పరిపాలన వ్యవహారాలపై కనీస జ్ఞానం లేకుండా అవాకులు చెవాకులు పేలుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు.. కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతోనే టీఎస్పీఎస్సీ వ్యవహారంలో పదేపదే తన పేరును లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రూ. పదివేల కోట్ల కొవిడ్‌ వ్యాక్సీన్ కుంభకోణం జరిగిందని, రూ. వేలకోట్ల విలువచేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారని అన్నారు. రేవంత్‌తో పోటీపడి  బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనిస్తున్నారన్నారు. వీరిద్దరు మానసిక సంతులనం కోల్పోయారని ప్రజలు భావిస్తున్నారన్నారని... వీరి నాయకత్వంలో కాంగ్రెస్, భాజపా పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, భాజపా దుష్ప్రచారాల వెనక ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే భయంకరమైన కుట్ర దాగి ఉందని ఉందని కేటిఆర్ అన్నారు.  ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారని, చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు, వాళ్ల కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారంతో అంటగట్టి.. యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేసిన ప్రయత్నాలు విఫలమైనా వీరికి బుద్ధి రాలేదని కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ రాబందుల మాదిరిగా కాంగ్రెస్, భాజపా మారాయని మండిపడ్డారు. తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చి మాటల ఉచ్చులో పడకుండా.. పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని యువతను కేటీఆర్ కోరారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోందన్నారు. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్రలను, ప్రచారాన్ని నమ్మువద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని