Nirmala Sitharaman: కాంగ్రెస్‌ ఎక్కడుంటే అక్కడ అమానుషమే: నిర్మలా సీతారామన్‌

కాంగ్రెస్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగదని, వారిని ఆ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

Published : 16 Dec 2023 01:29 IST

దిల్లీ: కర్ణాటకలోని బెళగావిలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న అమానుష ఘటనపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 42 ఏళ్ల మహిళను వివస్త్రను చేసి నడివీధిలో పరుగెత్తించి, ఓ కరెంటు స్తంభానికి కట్టేసి అమానుషంగా ప్రవర్తిస్తుంటే అక్కడి ప్రభుత్వం ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్‌ కర్ణాటక నుంచి రాజ్యసభ  ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కేసు విచారణలో కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) తీరుపై అక్కడి హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తి చేసిందని చెబుతూ.. సంబంధిత స్క్రీన్‌ షాట్‌ను ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు.

కాంగ్రెస్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగదని సీతారామన్‌ విమర్శించారు. వారిని ఆ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తోందని ఆరోపించారు. గతంలో రాజస్థాన్‌లో చోటు చేసుకున్న దురాగతాలే ప్రస్తుతం కర్ణాటకలోనూ ప్రారంభమయ్యాయని, కాంగ్రెస్‌ ఎక్కడ అధికారంలో ఉన్నా.. ఇలా అమానుష ఘటనలు సర్వసాధారణమయ్యాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ కుటుంబానికి చెందిన యువతి, ఆ మహిళ కుమారుడితో పారిపోయిందనే కోపంతో వారు ఆమెను కరెంటు స్తంభానికి కట్టేసి వికృత చేష్టలకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే ఈ ఘటనపై రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌ వేదికగా స్పందించారు.

‘‘ఈ అమానవీయ ఘటన సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేసింది. ఇలాంటి చర్యలను మా ప్రభుత్వం సహించదు. మహిళపై ఈ నేరానికి పాల్పడిన పలువురు అరెస్టయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేయడం మా బాధ్యత’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక హైకోర్టు బెళగావి పోలీస్‌ కమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి స్వయంగా అందజేయాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని