Uttam Kumar Reddy: మేడిగడ్డ సందర్శనకు ప్లాన్‌ చేయండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశం

నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించారు.

Updated : 11 Dec 2023 17:02 IST

హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్‌ కుంగడం చాలా తీవ్రమైన అంశమన్నారు. మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన ఏజెన్సీని, అధికారులను పర్యటనలో తన వెంట ఉండేలా చూడాలన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాజెక్టుల గురించి మంత్రికి ఈఎన్‌సీ మురళీధర్‌రావు వివరించారు. సమీక్ష అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు.

వచ్చేవారం నుంచి ప్రతి ప్రాజెక్టుపై విడివిడిగా..

వచ్చేవారం నుంచి ప్రతి ప్రాజెక్టుపై విడివిడిగా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని ఉత్తమ్‌ చెప్పారు. మేడిగడ్డను ఎవరు నిర్మించినా.. జరిగిన ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు నిర్మించిన ఏజెన్సీ, అధికారులు జవాబుదారీలవుతారన్నారు. ‘‘రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కింద నామమాత్రంగా కొత్త ఆయకట్టు ఉంది. ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు వివరాలు చెప్పాలని అధికారులను అడిగా. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల పురోగతిపై ఆరా తీశాను. సొరంగం పనులు చేస్తున్న సంస్థకు బిల్లులు బకాయి ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 40 వేల చెరువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం’’ అని మీడియాకు ఉత్తమ్‌ వెల్లడించారు.

సమీక్ష సాగిందిలా..

అంతకుముందు సమీక్షలో ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడంపై మంత్రికి అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ.4,600 కోట్లు ఖర్చు చేశాం. అందులోని ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగడంతో.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడింది. ముందురోజు సాయంత్రం పిల్లర్‌ కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని తోడేశాం. నీటిని తోడిన తర్వాత పిల్లర్‌ కుంగడం తగ్గింది’’ అని అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం స్పందించిన మంత్రి ఉత్తమ్‌.. ఇది చాలా తీవ్రమైన అంశమని, ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘‘అక్కడ ఖర్చు చేసిందెంత?ఎంత ఆయకట్టుకు నీరిచ్చేందుకు నిర్మాణం జరిగింది?ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చెంత?’’ అని అధికారులను మంత్రి ప్రశ్నించారు.

ఆ వివరాలు సిద్ధం చేయాలి

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పూర్తి వివరాలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేద్దామన్నారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఏవిధంగా నిర్మిస్తారు? నిధులు ఎలా సమీకరించారు?అని ప్రశ్నించారు. ‘‘నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు థర్డ్ పార్టీ చెకింగ్ లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ అనుమతి ఉందా? పాత ఆయకట్టును కూడా ఎందుకు కొత్త ఆయకట్టులో కలుపుతున్నారు? వర్షం వచ్చినప్పుడు నీటిని లిఫ్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు కదా! నీటిపారుదల శాఖ పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా సమర్థంగా పనిచేయాలి. ఇదివరకు నీటిపారుదల శాఖలో ఎదో జరిగిందని అనుమానాలు ఉన్నాయి. వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు తొందరగా దెబ్బతినడం ఆందోళనకరం. ఎందుకు అలా జరిగింది?’’ అని మంత్రి అధికారులను ప్రశ్నించారు. దీంతో ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలతో సమీక్షకు వస్తామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని