TS Assembly: జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి: అసెంబ్లీలో ఉత్తమ్‌ పీపీటీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.

Updated : 12 Feb 2024 14:37 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు ‘కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. భారాస ప్రభుత్వ తప్పిదాలు’ పేరుతో నోట్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఆ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే.. ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని.. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది.

అనంతరం సభలో తీర్మానం ప్రవేశపెట్టిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. ‘‘ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్‌పైకి పోలీసులను పంపింది. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయింది. కేసీఆర్‌ ఓడిపోబోతున్నారనే సాగర్‌పైకి జగన్‌ పోలీసులను పంపినట్లు అనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులకు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారు.

కేసీఆర్‌ గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్‌ పొగిడారు..

బచావత్‌ ట్రైబ్యునల్‌ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు. రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కారు విఫలమైంది. భారాస పాలకులది అసమర్థతో.. అవగాహనా లోపమో అర్థంకాదు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దిల్లీ వెళ్లి 512:299 టీఎంసీలకు ఒప్పుకొన్నారు. ఆ కేటాయింపును ఏపీ ప్రభుత్వం శాశ్వతం చేస్తోంది.  కృష్ణా జలాల్లో 70 శాతం హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉంది. పదేళ్ల భారాస పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు. జగన్‌, కేసీఆర్‌ గంటలతరబడి మాట్లాడుకున్నారు.. కలిసి బిర్యానీలు తిన్నారు. కేసీఆర్‌ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్‌ పొగిడారు. తెలంగాణ జలాలను సైతం ఇస్తున్నారని చెప్పారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్‌ 203 జారీ చేసింది. రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించాలని నిర్ణయించింది. 797 అడుగుల వద్ద నీటి తరలింపు జీవో ఇచ్చింది’’ అన్నారు. ఈ సందర్భగా కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ ఏపీ శాసనసభలో సీఎం జగన్‌ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు.

కావాలనే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి కేసీఆర్‌ వెళ్లలేదు..

అనంతరం ఉత్తమ్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘రాయలసీమ లిఫ్ట్‌ పూర్తయితే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తుంది. ఆ లిఫ్ట్‌ టెండర్లు పూర్తయ్యాకే కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. పరోక్షంగా సహకరించారు. కావాలనే ఆయన అపెక్స్‌ కౌన్సిల్ భేటీకి హాజరుకాలేదు. సమావేశానికి వెళ్లి అభ్యంతరం తెలిపితే రాయలసీమ లిఫ్ట్‌ ఆగేది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని భారాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2013లోనే ప్రాజెక్టు మొదలైనా.. ఇప్పటికీ పనులు పూర్తిచేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. నల్గొండలో నిర్వహించే సభకు వెళ్లేముందు కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు భారాస క్షమాపణ కోరాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని