సాంకేతిక అవగాహన లేకున్నా.. భారాస నేతలు మాట్లాడడం దురదృష్టకరం: ఉత్తమ్‌

మేడిగడ్డ బ్యారేజీ సహా అన్నారం, సుందిళ్ల పరిశీలనకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ నెల 6న రాష్ట్రానికి వస్తుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 03 Mar 2024 23:27 IST

హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ సహా అన్నారం, సుందిళ్ల పరిశీలనకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ నెల 6న రాష్ట్రానికి వస్తుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. సుందిళ్ల, అన్నారం ఆనకట్టల్లోనూ మేడిగడ్డలో ఉన్న సమస్యలు ఉన్నాయని.. వాటిని కూడా ఖాళీ చేయాలన్న నిపుణుల సూచనల మేరకే నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో భారాస రాజకీయాలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఆ నాయకులకు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకున్నా.. మాట్లాడడం దురదృష్టకరమని ఆక్షేపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్లు, అన్ని విషయాల్లో నిబంధనలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. రూ.94 వేల కోట్ల వ్యయం చేసిన ప్రాజెక్టులో.. మేడిగడ్డ బ్యారేజీ గుండెకాయ లాంటిదన్నారు. భారాస నాయకుల మాటలకు విలువ లేదని, ఆనకట్ట కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సింది పోయి ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఎన్డీఎస్‌ఏ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సూచనలను మాత్రమే ప్రభుత్వం పాటిస్తుందని తెలిపారు. నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడానికి 4 నెలల గడువు ఉన్నప్పటికీ... సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని