Eatala Rajendar: కేయూ విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తారా?: ఎమ్మెల్యే ఈటల

కేయూ విద్యార్థులను పోలీసులతో దారుణంగా కొట్టించిన ఘటనను దేశం మొత్తం చూస్తోందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

Updated : 07 Sep 2023 16:40 IST

హైదరాబాద్‌: కేయూ విద్యార్థులను పోలీసులతో దారుణంగా కొట్టించిన ఘటనను దేశం మొత్తం చూస్తోందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  విద్యార్థులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తీసుకెళ్లి కొట్టడం దేశ చరిత్రలో తెలంగాణలోనే జరిగిందన్నారు. విద్యార్థులను కొట్టిన తీరు చూసి న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారన్నారు. విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టిన ఘతన కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక ఎమ్మెల్సీ ప్రాపకంతో కేయూ వీసీగా వచ్చిన రమేశ్‌.. అప్పటి నుంచి విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. 

విద్యార్థులను కొట్టారనేది అవాస్తవం: సీపీ

కాకతీయ వర్సిటీలో జరిగిన ఘర్షణ, అనంతరం నెలకొన్న పరిణామాలపై వరంగల్‌ సీపీ రంగనాథ్‌ మీడియాతో మాట్లాడారు.‘‘ కేయూ విద్యార్థులను తీవ్రంగా కొట్టారనేది అవాస్తవం. ఒక విద్యార్థికి మాత్రమే చిన్న ఎయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌  అయ్యింది. ప్రశాంత్‌ అనే విద్యార్థికి అయిన ఫ్రాక్చర్‌ కూడా నెలరోజుల క్రితం జరిగింది. లేని గాయాలకు విద్యార్థులు కట్లు కట్టుకున్నారు. అనుమానం ఉంటే విద్యార్థులకు మరెక్కడైనా వైద్య పరీక్షలు చేయించవచ్చు’’ సీపీ రంగనాథ్‌ తెలిపారు.

బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి జేఏసీ

కాకతీయ వర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విశ్వవిద్యాలయంలోని దూరవిద్య కేంద్రం వద్ద 12 విద్యార్థి సంఘాలు ఏకమై రిలే దీక్ష చేపట్టాయి. కేయూ వీసీ రమేశ్‌ను బర్తరఫ్‌ చేయడంతో పాటు విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేయూలో జరిగిన అవినీతి అవకతవకలపై రిజిస్ట్రార్‌కు వివరించే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘం నాయకులపై పోలీసులతో దాడి చేయించడం బాధాకరమన్నారు. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈనెల 12న ఉమ్మడి వరంగల్‌ జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు కేయూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు తిరుపతి యాదవ్‌ తెలిపారు. బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని, అన్ని పాఠశాలలు, కళాశాలలు మద్దతు తెలిపాలని కోరారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని