AP news: అమ్మలు, అవ్వాతాతలు మోసం చేశారనడానికి సిగ్గు లేదా?

ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయానా? అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజలు తనను మోసం చేశారని మాట్లాడటంకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి లేదని తెదేపా నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.

Published : 06 Jun 2024 04:03 IST

జగన్‌ పై తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజం 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయానా? అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజలు తనను మోసం చేశారని మాట్లాడటంకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి లేదని తెదేపా నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఆయన చెప్పినట్టే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని ఎద్దేవా చేశారు. అమ్మలు, అవ్వాతాతలు తనను మోసం చేశారని ఆయన అనడం, దాన్ని వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ప్రచారం చేయడం హేయమని మండిపడ్డారు. నీతిలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్‌రెడ్డేనని దుయ్యబట్టారు. ఆయన అరాచకం, నిరంకుశ, నియంతృత్వ పాలనను ప్రజలు కూకటివేళ్లతో పెకిలించారని అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అయిదేళ్లలో జగన్‌ సాధించిందేంటి? ప్రత్యేక హోదా తెచ్చారా? సీపీఎస్‌ రద్దు చేశారా? మెగా డీఎస్సీ ప్రకటించారా? ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారా? అసలు ప్రజలు ఆయనకెందుకు ఓటేయాలి?’ అని నిలదీశారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై హత్యలు, అత్యాచారాలు, అరాచకాలు జరుగుతున్నా ఆయన నోరు మెదపలేదు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. పోలవరాన్ని గోదావరిలో ముంచారు. మూడుముక్కలాటతో అమరావతి పతనానికి కారణమయ్యారు. పేదలకు దక్కాల్సిన 138 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టకొట్టారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చి పేదల భూములను కొట్టేయాలని చూశారు. వైకాపా వాళ్లు చేయని అరాచకం లేదు’ అని నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు