Modi: ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ

సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేడీ ప్రభుత్వ విధానాలను ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఈసందర్భంగా పూరీ ఆలయ భాండాగారం ప్రస్తావన తెచ్చారు. 

Published : 20 May 2024 16:40 IST

పూరీ: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని మోదీ(Modi) విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం ఒడిశా(Odisha)లో పర్యటించిన ఆయన.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయాన్ని(Puri temple) దర్శించుకున్నారు. అనంతరం బీజేడీ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ పాలనలో దేవాలయానికి కూడా రక్షణలేకుండా పోయిందన్నారు.

‘‘ఈ ప్రభుత్వ హయాంలో జగన్నాథుడి ఆలయం సురక్షితంగా లేదు. గత ఆరేళ్ల నుంచి రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదు’’ అని మోదీ విమర్శించారు. కొద్దిరోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇదే విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. ‘‘కొన్నాళ్లుగా కోట్లాదిమంది పూరీ జగన్నాథ్‌ స్వామి భక్తులు రత్నభాండాగారం గురించే ఆలోచిస్తున్నారు. ఈ భాండాగారం తాళం చెవుల మిస్టరీని బయటపెట్టాలని కోరుకొంటున్నారు. నవీన్‌ పట్నాయక్‌ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి నమ్మకాలు, విశ్వాసాలతో ఆడుకుంటున్నారు. నకిలీ తాళాలు ఎవరు తయారుచేశారు?’’ అని ప్రశ్నించారు.

ఆ రత్న భాండాగారంలో ఏమున్నాయ్..? ఎందుకు తెరవడం లేదు?

ఆ భాండాగారంలో అప్పటి రాజులు, భక్తులు దేవతామూర్తులకు కానుకగా సమర్పించుకున్న విలువైన ఆభరణాలు ఉన్నాయి. దీనిని 1985లో చివరిసారిగా తెరిచారు. చాలాకాలంగా దానిని తెరవనందున లోపల పరిస్థితి ఎలా ఉందన్న దానిపై స్పష్టత లేదు. దాంతో 2018 ఏప్రిల్‌ 4న భాండాగారం పరిశీలనకు వెళ్లిన నిపుణుల బృందం రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయింది. ఆ విషయం బయటకు తెలియడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.

2009 నుంచి ఒడిశాలో నవీన్‌ పట్నాయక్ (బీజేడీ) ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014లో మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవీన్‌ లోపాయికారీగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికీ బీజేడీ మద్దతిచ్చింది. దీనికి బదులుగా కేంద్రం ఆ రాష్ట్రానికి అన్నివిధాలా సహకరించింది. ప్రస్తుత ఎన్నికల్లో రెండు పార్టీలు ఒంటరిగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని